Next ipl rcb captain 2022: ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఇటీవలే తప్పుకున్నాడు కోహ్లీ. ఇకపై కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. దీంతో వచ్చే సీజన్లో పగ్గాలు ఎవరు చేపడతారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆర్సీబీ మాజీ కోచ్ డేనియల్ వెటోరి. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని అన్నాడు.
"కోహ్లీ బాధ్యతలను గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీసుకునే అవకాశాలున్నాయి. గత సీజన్లో అతడు అద్భుతంగా ఆడాడు. అన్నీ జట్లు తమ కెప్టెన్లను అట్టిపెట్టుకున్నాయి. నాకు తెలిసి ఆర్సీబీకి మ్యాక్స్‌వెల్ సారథి అవుతాడు. అది వచ్చే సీజన్‌కు మాత్రమే అని చెప్పగలను. ఎందుకంటే అతడి నాయకత్వంలో జట్టు ప్రదర్శన బాగుంటే భవిష్యత్‌లో కెప్టెన్‌గా అతడు కొనసాగే అవకాశముంటుంది. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం మ్యాక్వెల్కు ఉంది. అతడి సారథ్యంలో జట్టు 62 మ్యాచ్‌ల్లో 34 విజయం సాధించింది"
-డేనియల్ వెటోరి, ఆర్సీబీ మాజీ కోచ్
ఐపీఎల్ 2022లో భాగంగా అన్ని ఫ్రాంచైజీలు రిటైన్డ్ లిస్ట్‌ను ఇటీవలే ప్రకటించాయి. ఇందులో ఆర్సీబీ... కోహ్లీ(రూ.15కోట్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్(రు.11కోట్లు), మహ్మద్ సిరాజ్‌ను(రూ.7కోట్లు) అట్టిపెట్టుకున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: IPL RCB: బెంగళూరు 'బెంగ' తీర్చే కెప్టెన్ ఎవరు?