ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ఒలీ రాబిన్‌సన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేయడంపై టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) విచారం వ్యక్తం చేశాడు. ఏడెనిమిదేళ్ల క్రితం ట్విటర్‌లో రాబిన్‌సన్ చేసిన జాతి వివక్ష, లైంగిక సంబంధిత విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(England cricket Board) సోమవారం అతడిపై నిషేధం విధించింది. న్యూజిలాండ్‌తో ఆడిన తొలి టెస్టు వెంటనే అతడికి ఇలా జరగడం విచారకరం. ఈ నేపథ్యంలోనే అశ్విన్ తాజాగా ఓ ట్వీట్ చేస్తూ ఇంగ్లాండ్ క్రికెటర్ పట్ల బాధను వ్యక్తపరిచాడు. సామాజిక మాధ్యమాలతో భవిష్యత్ ఎలా ఉంటుందనేదానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నాడు.
"కొన్నేళ్ల క్రితం రాబిన్‌సన్ ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో ఏం చేశాడో నేను అర్థం చేసుకోగలను. అయితే, అతడు టెస్టు క్రికెట్‌లో అదిరిపోయే అరంగేట్రం చేసిన వెంటనే ఇలా జరగడం విచారకరం. అందుకు మనసారా బాధపడుతున్నా. ఈ సోషల్‌మీడియా యుగంలో భవిష్యత్ ఎలా ఉంటుందనేదానికి ఈ సస్పెన్షన్ ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తుంది" అని అశ్విన్ ట్వీట్ చేశాడు.
దీనికి స్పందించిన టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ వసీమ్ జాఫర్(Wasim Jaffer) తనదైన శైలిలో రీట్వీట్ చేశాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించాక ట్విటర్ వాడుతున్నానని, అందుకు అదృష్టవంతుడినని జోక్ చేశాడు.
రాబిన్‌సన్ గతవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనే అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలోనే అతనెప్పుడో చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపాయి. దాంతో విచారణ చేపట్టిన ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అతడిపై నిషేధం విధించింది.
ఇదీ చూడండి: 'నేటి మేటి టెస్టు బౌలర్లలో అశ్విన్ ఒకడు'