అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగనున్న మూడో టెస్టు.. సుదీర్ఘ ఫార్మాట్లో ఇషాంత్ శర్మకు వందో మ్యాచ్ కానుంది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ తర్వాత ఈ ఫీట్ అందుకోనున్న రెండో భారత బౌలర్ ఇషాంత్.
గత 14 నెలలుగా గాయాలతో సతమతమవుతున్న లంబూ.. తాజాగా స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లో తిరిగి జట్టులోకి వచ్చాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో మూడు వికెట్లు పడగొట్టిన ఈ దిల్లీ పేసర్.. 300 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.
"నాకు తెలిసి ఇండియా తరఫున వంద టెస్టులు ఆడే చివరి బౌలర్ ఇషాంతే అవుతాడు. ఈ రోజుల్లో బౌలర్లందరూ పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం సుదీర్ఘ ఫార్మాట్లకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇషాంత్‌ను అధిగమించే అవకాశమే లేదు."
-విజయ్ దహియా, దిల్లీ జట్టు కోచ్.
మొదటి 79 టెస్టుల్లో 226 వికెట్లు తీసిన ఇషాంత్.. తర్వాతి 20 మ్యాచ్‌ల్లో 76 వికెట్లు పడగొట్టాడు. గత ఆసీస్ పర్యటనలోనే ఈ రికార్డును అందుకోవాల్సి ఉన్నా.. గాయాల కారణంగా కాస్త ఆలస్యమైంది. భారత జట్టులో సుదీర్ఘ కాలం కొనసాగిన లంబూ.. తనను తాను ఓ అడుగంటిన దీపంతో పోల్చుకోవడం గమనార్హం.
అశ్విన్ అందుకునేనా..?
టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది. టెస్టుల్లో మరో ఆరు వికెట్లు తీస్తే 400 వికెట్ల క్లబ్లో చేరుతాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న పింక్ బాల్ టెస్టులో అశ్విన్ ఈ ఘనత సాధిస్తే.. ఈ ఫీట్ అందుకున్న నాలుగో భారత బౌలర్‌గా నిలుస్తాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అనిల్ కుంబ్లే 619 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. కపిల్‌దేవ్(434), హర్భజన్ సింగ్(417)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చదవండి: తొమ్మిదో సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా జకోవిచ్