భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కె.ఎల్.రాహుల్‌లపై బీసీసీఐ అంబుడ్స్‌మన్ జరిమానా విధించింది. ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ఆటగాళ్లకు రూ.20 లక్షల ఫైన్ వేసింది. చెరో 10 లక్షల రూపాయలను పారా మిలిటరీలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందించాలని ఆదేశించింది బీసీసీఐ. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున సాయమందించాలని సూచించింది. మిగిలిన పదిలక్షలను అంధుల క్రికెట్ అసోసియేషన్‌కు ఇవ్వాలని ఆదేశించింది.
ఈ డబ్బును నాలుగు వారాల్లోగా బాధిత కుటుంబాలకు అందజేయాలని సూచించింది బీసీసీఐ. ఏప్రిల్ 19 నుంచి ఈ కాలపరిమితి అమలులో ఉంటుంది. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తామని తెలిపింది.
ఆ ఏడాది జనవరిలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా ఉన్న షోలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కరణ్ అడిగిన ఓ ప్రశ్నకు అభ్యంతకర సమాధానమిచ్చినందుకు బీసీసీఐ వీరిపై సస్పెన్షన్ విధించింది. అనంతరం సుప్రీంకోర్టు శిక్షను రద్దు చేసింది. బీసీసీఐ ఇప్పుడు జరిమానా విధించింది.