ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాల మధ్య మొదలైన క్రికెట్ విశ్వసమరంలో హోరాహోరీగా తలపడ్డాయి కివీస్- ఇంగ్లాండ్. ఇప్పటివరకూ వరల్డ్‌కప్ ట్రోఫీని దక్కించుకోని ఇంగ్లాండ్, కివీస్ నువ్వానేనా అన్నట్టు కొదమసింహాల్లా పోరాడాయి. అయితే చివరికి సూపర్ ఓవర్ సమరంతో ప్రపంచకప్ విజేతగా అవతరించింది ఇంగ్లాండ్. వారి దేశ క్రికెట్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తూ సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది.
చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ. లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఇంగ్లాండ్ మ్యాచ్ టైగా ముగించింది. సూపర్ ఓవర్ కూడా టై అయింది. బౌండరీలు ఎక్కువ సాధించిన ఇంగ్లాండ్.. జగజ్జేతగా నిలిచింది.
లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్ 55 అత్యధిక పరుగులు చేశాడు. లేథమ్ 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో గప్తిల్ 11, విలియమ్సన్ 30, టేలర్ 15, నీషమ్ 19, గ్రాండ్‌హోమ్ 16 పరుగులు చేశారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, ప్లంకెట్ తలో 3 వికెట్లు తీశారు. ఆర్చర్, వుడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ రాయ్ (17) తొందరగానే ఔటయ్యాడు. కాసేపటికే రూట్ (7), బెయిర్ స్టో (36) వెనుదిరిగారు. కెప్టెన్ మోర్గాన్ (9) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. ఫలితంగా 86 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లాండ్.
బట్లర్- స్టోక్స్ శతక భాగస్వామ్యం
అనంతరం స్టోక్స్-బట్లర్ జోడీ సమయోచితంగా ఆడుతూ పరుగులు సాధించారు. కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. స్టోక్స్ నెమ్మదిగా ఆడగా.. బట్లర్ తనదైన శైలిలో చెలరేగాడు. ఈ క్రమంలోనే ఇరువురు అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు.అనంతరం 59 పరుగులు చేసిన బట్లర్ ఫెర్గుసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫలితంగా ఐదో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఓ ఎండ్‌లో స్టోక్స్ నిలబడినా ఇతర బ్యాట్స్‌మెన్ వచ్చిన వారు వచ్చినట్లే వెనుదిరిగారు. వోక్స్ 2, ప్లంకెట్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. రషీద్, వుడ్ పరుగులేమి చేయకుండానే రనౌట్ అయ్యారు. ఆర్చర్ నీషమ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
చివరి ఓవర్లో 15 పరుగుల కావాలి. ఆ స్థితిలో అద్భుతంగా ఆడిన స్టోక్స్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను టైగా ముగించాడు.
కివీస్ బౌలర్లలో నీషమ్, ఫెర్గుసన్ తలో 3 వికెట్లు తీశారు. గ్రాండ్‌హోమ్, హెన్రీ తలో వికెట్ దక్కించుకున్నారు.
సూపర్ ఓవర్ ఇంగ్లాండ్‌దే..
సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. వికెట్లేమి కోల్పోకుండా 15 పరుగులు చేసింది. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. వికెట్ కోల్పోయి సరిగ్గా అన్ని పరుగులే చేసింది. కేవలం ఒక సిక్స్ మాత్రమే కొట్టింది.
బౌండరీలు ఎక్కువ కొట్టిన ఇంగ్లాండ్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
ఇది చదవండి: WC19: మ్యాట్ హెన్రీ రికార్డ్