ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నాయి. అయితే రానున్న మ్యాచుల్లో బౌలర్లే గేమ్ చేంజ్ చేస్తారని శ్రీలంక పేసర్ లసిత్ మలింగ అభిప్రాయపడ్డాడు. ఎక్కువ స్కోరు నమోదైనప్పటికీ బౌలర్లు సత్తాచాటతారని తెలిపాడు.
"ప్రస్తుతం క్రికెట్... బ్యాట్స్‌మెన్ గేమ్ అయింది. కానీ బౌలర్లు కూడా ఆట మలుపు తిప్పగలరు. వచ్చే ప్రపంచకప్‌లో కీలక సమయాల్లో వికెట్లు తీసి బౌలర్లే మ్యాచ్‌ను గెలిపిస్తారు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నప్పుడు బౌలర్లు ఆటను విశ్లేషించగల నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడే మంచి ప్రదర్శన చేయగలరు" -లసిత్ మలింగ, శ్రీలంక పేసర్.
ఫార్మాట్‌కు తగ్గట్టు ఆటలో వైవిధ్యం ఉండాలని, అప్పుడే ఎందులోనైనా రాణించగలమని చెప్పాడు. మ్యాచ్ విన్నర్ కావాలంటే తప్పక వికెట్లు తీయాల్సిందేనని తెలిపాడు. సోమవారం ఆసీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో లసిత్ మలింగ ఆడలేదు. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై కంగారూ జట్టు గెలిచింది.