జోఫ్రా ఆర్చర్... ఇంగ్లాండ్ యువ సంచలనం. ఐపీఎల్లో తన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి భారత క్రికెట్ అభిమానులకూ దగ్గరయ్యాడు. ఇంగ్లాండ్ తరఫున 6 వన్డేలే ఆడాడు. కానీ ఇప్పటికే పలువురు క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంగ్లాండ్- వెస్టిండీస్ మ్యాచ్‌లో అందరి చూపులు ఆర్చర్‌పైనే ఉండనున్నాయి. ఎందుకంటే, కరీబియన్‌లో పుట్టి పెరిగిన ఆర్చర్... ఇప్పుడు ప్రపంచకప్‌లో విండీస్‌పై సమారానికి సిద్ధమవుతుండటమే కారణం.
'వెస్టిండీస్ టు ఇంగ్లాండ్' ఇలా...
24 ఏళ్ల జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ... వెస్టిండీస్‌లో జన్మించాడు. ఆర్చర్ తండ్రి ఇంగ్లాండ్ దేశస్థుడు. అన్నీ సరిగా జరిగి ఉంటే ఇప్పుడు కరీబియన్ జట్టు తరఫున ఆడేవాడు. కానీ నాలుగేళ్ల ముందు అండర్-19 ప్రపంచకప్ ఎంపికలో ఆర్చర్‌కు విండీస్ సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కౌంటీ జట్టు ససెక్స్‌లో చేరాడు. నిరంతరం శ్రమిస్తూ ఇంగ్లాండ్ జట్టులో చోటు సంపాదించాడు.
ఇప్పుడు వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆర్చర్‌కు ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే సొంత గడ్డ కరీబియన్ జట్టులోని ఆటగాళ్లతో ఆర్చర్‌కు పరిచయం ఉంది. నికోలస్ పూరన్, హెట్మెర్లతో కలిసి జూనియర్ స్థాయి క్రికెట్ ఆడాడు ఆర్చర్. ఇప్పుడు వారికి ప్రత్యర్థిగా నిలవనున్నాడు ఈ ఫాస్ట్ బౌలర్.
ఈ విషయంపై ఇంగ్లాండ్ వన్డే జట్టు సారథి మోర్గాన్ స్పందించాడు. విండీస్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఆర్చర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తనకు తెలుసని స్పష్టం చేశాడు.
"ఈ ఒత్తిడి జోఫ్రా జయించగలడు. అతడు ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను జోఫ్రా అధిగమించాడు. ఇప్పుడు కూడా ఫలితం మారదని ఆశిస్తున్నా."
--- మోర్గాన్, ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్.
ఐర్లాండ్ దేశస్థుడైన మోర్గాన్... ఎన్నో ఏళ్లుగా ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇదీ చూడండి:- ఎన్టీఆర్ తనయుడి మొదటి పుట్టినరోజు ఫోటోలు