ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్‌తో పాటు అత్యధిక వికెట్లు తీసిన రవి బిష్ణోయ్ ఈ జట్టుకు ఎంపికయ్యారు. అలాగే ఈ టోర్నీలో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన రైట్ ఆర్మ్ పేసర్ కార్తీక్ త్యాగి సైతం స్థానం సంపాదించాడు. ఈ జట్టుకు బంగ్లాదేశ్ సారథి అక్బర్ అలీ నాయకత్వ బాధ్యతల్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో 88 పరుగులు చేసిన జైశ్వాల్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అందులో ఒక శతకం, నాలుగు అర్ధశతకాలున్నాయి.
రవి బిష్ణోయ్ ఆరు మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. కార్తీక్ త్యాగి 11 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉండగా ఆదివారం బంగ్లాదేశ్‌తో ఫైనల్లో టీమ్‌ఇండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో బంగ్లా తొలిసారి ప్రపంచకప్ అందుకొని చరిత్ర సృష్టించింది. అండర్-19 జట్టులో భారత్, బంగ్లాదేశ్ నుంచి ముగ్గురు క్రికెటర్లు.. అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఎంపికయ్యారు. అలాగే శ్రీలంక నుంచి ఒకరు, కెనెడా నుంచి మరొకరు ఉన్నారు. బంగ్లా ఆటగాళ్లలో కెప్టెన్‌తో పాటు హషదత్ హొసేన్, మహ్మదుల్ హసన్ జాయ్ అవకాశం పొందారు. అలాగే కెనడా ఆటగాడు అకిల్ కుమార్‌ను పన్నెండో ఆటగాడిగా ఎంపిక చేశారు.
ఐసీసీ యూ-19 జట్టు:
యశస్వి జైశ్వాల్(భారత్), ఇబ్రహీం జద్రాన్(అఫ్గానిస్థాన్), రవిండు రసంత(శ్రీలంక), మహ్మదుల్ హసన్ జాయ్(బంగ్లా), షహదత్ హోసేన్(బంగ్లా), నయీం యంగ్(వెస్టిండీస్), అక్బర్ అలీ(బంగ్లా.. కీపర్,కెప్టెన్), షఫీకుల్లా ఘఫారీ(అఫ్గానిస్థాన్), రవిబిష్ణోయ్(భారత్), కార్తీక్ త్యాగి(భారత్), జయ్‌డెన్ సీల్స్(వెస్టిండీస్), అకిల్ కుమార్(కెనెడా).
ఇదీ చూడండి.. రవి బిష్ణోయ్: తిరస్కరణ నుంచి ప్రశంసలు వరకు