టీమ్‌ఇండియా సెలక్షన్ ప్రక్రియపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. "కెప్టెన్, కోచ్‌లూ సెలక్టర్లుగా ఉండాల్సిన సమయమొచ్చింది. తుది జట్టు ఎంపిక పూర్తిగా కెప్టెన్ చేతుల్లో ఉండాలి. కానీ అదే సమయంలో జట్టు ఎంపిక ప్రక్రియలో కోచ్, కెప్టెన్‌కు ఓటు హక్కు ఉండాలి. అప్పుడు ఎంపికైన జట్టు ప్రదర్శనకు సంబంధించి వాళ్లు బాధ్యత నుంచి తప్పించుకోలేరు" అని ఆన్‌లైన్‌లో చర్చ సందర్భంగా అభిప్రాయపడ్డాడు గౌతమ్ గంభీర్.
దీనికి ప్రసాద్ బదులిస్తూ.. "సెలక్షన్ ప్రక్రియలో కెప్టెన్ అభిప్రాయానికి ఎప్పుడూ విలువ ఉంటుంది. నిబంధనల ప్రకారం అతడికి ఓటు హక్కు మాత్రం లేదు" అన్నాడు. ఇక భారత జట్టు నాలుగో స్థానం సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోయినందుకు ఎమ్మెస్కే బృందంపై గంభీర్ మండిపడ్డాడు. "ప్రపంచకప్ జట్టు ఎంపికకు సంబంధించి సెలక్షన్ కమిటీ నిర్ణయాలు దిగ్భ్రాంతి కలిగించాయి. రాయుడిను ఎంపిక చేయకపోవడం అందులో ఒకటి. సెలక్టర్లు సరైన నాలుగో స్థానం బ్యాట్స్‌మన్‌ను ఎంపిక చేయలేకపోయారు. రెండేళ్ల పాటు రాయుడును ఎంపిక చేశారు. కానీ ప్రపంచకప్‌కు ముందు మాత్రం మీకు 3-డి (విజయ్ శంకర్) అవసరమయ్యాడు" అని గంభీర్ అన్నాడు. దీనికి ఎమ్మెస్కే బదులిస్తూ.. "టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే విజయ్ శంకర్.. ఇంగ్లీష్ పరిస్థితుల్లో బంతితోనూ ఉపయోగపడతాడని భావించాం" అని చెప్పాడు.
ఇదీ చూడండి... 'ఇంటికి రంగులేశా.. అమ్మకు సాయం చేస్తున్నా'