క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్‌గా భారత జట్టును కొత్త పుంతలు తొక్కించాడు మహేంద్ర సింగ్ ధోనీ. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా జట్టుకు విశేష సేవలు అందించాడు. వన్డే క్రికెట్ చరిత్రలోని ఉత్తమ ఫినిషర్లలో ధోనీ ఒకరు. పరాజయానికి చేరువలో ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చే సామర్థ్యంతో ఎంతో ప్రసిద్ధి పొందాడు. మంగళవారం (జులై 7) ధోనీ పుట్టినరోజు సందర్భంగా వన్డే క్రికెట్లో మహీ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల గురించి తెలుసుకుందాం.

2005: పాకిస్థాన్‌పై 148 రన్స్
అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం తర్వాత మొదటి నాలుగు వన్డేల్లో పేలవ ప్రదర్శన చేశాడు ధోనీ. తర్వాత భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మాత్రం విశ్వరూపం చూపించాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 పరుగులు సాధించాడు. ధోనీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 356 రన్స్ చేసింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.

2005: శ్రీలంకపై 183 పరుగులు
పాకిస్థాన్‌పై 148 పరుగుల విజయవంతమైన ఇన్నింగ్స్ తర్వాత అదే ఏడాది శ్రీలంకపై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు ధోనీ. తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదన తొలి ఓవర్లోనే సచిన్ వికెట్ కోల్పోయింది టీమ్ఇండియా.
మాస్టర్ ఔట్ అయిన ఆనందం కొంత సేపైనా శ్రీలంక ఆటగాళ్లలో నిలవలేదు. 3వ స్థానంలో బరిలో దిగిన ధోనీ.. ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. స్వీప్ షాట్లు, డ్రైవ్‌లతో లంక బౌలర్లను బెంబేలెత్తించాడు. 145 బంతుల్లో 183 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు ధోనీ. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తర్వాత ఆసియాలోని రెండు బలమైన జట్లపై అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా ఘనత వహించాడు.

2007: ఆఫ్రికా ఎలెవన్‌పై 139 రన్స్
2007లో ఆసియా ఎలెవన్ వర్సెస్ ఆఫ్రికా ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేవలం 97 బంతులు ఆడి 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు ధోనీ. 15 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగిపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా జట్టు నిర్ణీత ఓవర్లలో 332 పరుగులు సాధించింది. ఛేదనలో ఆఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసి 13 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

ఐపీఎల్-2010: 54 నాటౌట్ (పంజాబ్‌పై)
ఐపీఎల్-2010 ప్లేఆఫ్స్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కే రెండు బంతులు మిగిలుండగానే విజయాన్ని సొంతం చేసుకుంది.
చివరి ఓవర్లో చెన్నై 16 రన్స్ చేయాల్సి ఉంది. ఇర్ఫాన్ పఠాన్ బంతిని అందుకున్నాడు. మోర్కెల్‌తో పాటు కెప్టెన్ ధోనీ క్రీజ్‌లో ఉన్నాడు. మొదటి బంతికి కవర్ మీదుగా బౌండరీ సాధించాడు మహీ. ఇర్ఫాన్ పఠాన్ ఒత్తిడిలో వేసిన తర్వాత రెండు బాల్స్‌ను లాంగ్ ఆన్ దిశగా బౌండరీలు బాదాడు. నాలుగో బంతిని ఫినిషింగ్ షాట్‌గా సిక్సర్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ధోనీ ఆడిన ఫినిషింగ్ ఇన్నింగ్స్‌ల్లో ఈ మ్యాచ్ ఆల్‌టైమ్ ఫేవరెట్‌గా ఉంటుంది.

2011 ప్రపంచకప్ విన్నింగ్ షాట్
2011 ఏప్రిల్ 2.. భారత క్రికెట్ అభిమానులు మర్చిపోలేని రోజు. 28 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా తిరిగి విశ్వవిజేతగా నిలిచిన క్షణం. 2011 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చిన భారత్.. లీగ్ మ్యాచ్‌ల నుంచే సత్తా చాటుకుంటూ వచ్చింది. తుదిపోరులో శ్రీలంకపై ఘనవిజయాన్ని సాధించి.. 1983 తర్వాత రెండోసారి ప్రపంచకప్‌ను దక్కించుకుంది టీమ్ఇండియా.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 275 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. ఆదిలోనే సచిన్, సెహ్వాగ్ ఔట్ అవ్వడం వల్ల జట్టుపై మరింత ఒత్తిడి పెరిగింది. గౌతమ్ గంభీర్ 97 పరుగుల ఇన్నింగ్స్ భారత గెలుపునకు సాయపడింది. గంభీర్ ఔటైన తర్వాత బరిలో దిగిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 79 బంతుల్లో 91 పరుగులు(నాటౌట్) చేసి టీమ్ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. విజయానికి నాలుగు పరుగులు చేయాల్సిన క్రమంలో లాంగ్ఆన్ మీదుగా ధోనీ బాదిన సిక్సర్ అతని కెరీర్ ఉత్తమ ఫినిషింగ్ షాట్‌గా అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోయింది.

2012: ఆస్ట్రేలియాపై 44 నాటౌట్
అడిలైడ్ వేదికగా 2012లో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ నాలుగో మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ టీమ్ఇండియా విజయానికి బాటలు వేసింది. గంభీర్ వెనుదిరిగిన తర్వాత బరిలో దిగిన రైనా, జడేజాలు వెంటవెంటనే ఔటయ్యారు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి క్రీజ్‌లో ఉన్నాడు ఉన్నాడు ధోనీ. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో భారత్ 12 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో ఉన్న అశ్విన్ సింగిల్ తీసి ధోనీకి బ్యాటింగ్ ఇద్దామనే ప్రణాళికతో ఉన్నాడు. తొలి బంతి డాట్‌గా పోయింది. రెండో బంతికి రన్ తీసి బ్యాటింగ్ బాధ్యతను కెప్టెన్ ధోనీకి అప్పగించాడు అశ్విన్. మూడో బంతికి సిక్సర్ బాదాడు ధోనీ. ఆ తర్వాతి బంతి నోబాల్ అవ్వడం వల్ల బైస్‌తో పాటు మూడు పరుగులు లభించాయి. నాలుగో బంతికి మూడు రన్స్ చేసి టీమ్ఇండియాకు విజయాన్ని అందిచాడు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.
ఇదీ చూడండి... అత్యుత్తమ కెప్టెన్- రికార్డుల మహేంద్రుడు ధోనీ
ధోనీ అభిమానులకు బ్రావో గిఫ్ట్ వచ్చేసింది!