అశ్విన్:
సిడ్నీలో మేం మ్యాచ్ గెలవలేదు. అలా అని ఓడిపోనూ లేదు. కానీ సిడ్నీ టెస్ట్ డ్రా.. విజయం కన్నా గొప్పది. దానికి దారి తీసిన కారణాలు చాలానే ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనది క్వారంటైన్. సిడ్నీ టెస్ట్ ప్రారంభానికి ముందే క్వారంటైన్.. జట్టును సందిగ్ధ పరిస్థితుల్లో నెట్టేసింది. ఆస్ట్రేలియా టూర్‌కు పిలిచే ముందు వాళ్లు చెప్పింది ఒక్కటే.. మూడున్నర నెలల పాటు మీరు బబుల్‌లో ఉన్నట్లే. 14 రోజులు క్వారంటైన్లో ఉండండి..ఆ తర్వాత మీరు కాఫీ తాగొచ్చు, బయటికి వెళ్లొచ్చంటూ ఏవేవో చెప్పి సిరీస్‌కు రప్పించారు. ఇక్కడ మెల్బోర్న్లో గెలిచి 1-1తో సిరీస్ సమం చేశాక పరిస్థితులు మారిపోయాయి. రూం నుంచి బయటకు రావొద్దంటూ కఠిన ఆంక్షలు విధించారు. మీడియా మమ్మల్ని వెంటాడింది.
శ్రీధర్:
ఇది ఒక ఎత్తు. దుబాయ్‌లో ఐపీఎల్ ముగింపు దశలో ఉన్నాం. ఇంకో కొద్దిరోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్తున్నాం అన్న సమయంలో.. ఆటగాళ్లతో వారి కుటుంబాలు ఉండటానికి వీలు లేదంటూ ఆంక్షలను ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఇప్పించారు. టూర్ ప్రారంభం కాకుండానే జట్టును స్లెడ్జ్ చేయటానికి ఇలాంటివి చేస్తూ ప్రత్యర్థులను ఉసిగొల్పటం ఆసీస్‌కు మామూలే.
అశ్విన్:
ఆసీస్ పర్యటనకు కుటుంబసభ్యులకు అనుమతి లేదని నా భార్యకు చెప్పాను. నేనింక వేరేదారి చూసుకోనా మరి అంటూ తను వేళాకోళమాడింది. ఆరునెలల పాటు కుటుంబానికి దూరంగా ఎవరైనా ఉండగలరా..? ఇదేమన్నా వనవాసమా అర్థం కాలేదు.
శ్రీధర్:
ఏడుగురు ఆటగాళ్లు తమ కుటుంబంతో సహా సిద్ధమైపోయి ఉన్నారు. వాళ్లకు పరిస్థితి ఇదని ఎలా చెప్పగలం. రవిశాస్త్రి ఆ సమయంలో ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆటగాళ్లను కుటుంబాలతో సహా అనుమతించకపోతే టూర్‌కు రామని, రద్దు చేసుకుంటామని రవిశాస్త్రి తెగేసి చెప్పాడు. దాంతో ఆసీస్ బోర్డు పునరాలోచనలో పడింది. తప్పేది లేక ప్రభుత్వంతో మాట్లాడి కుటుంబాలను అనుమతించింది.
అశ్విన్:
ఎందుకో తెలియదు సిడ్నీలో బబుల్ నిబంధనలు చాలా విచిత్రంగానూ, అనుమానాస్పదంగానూ అనిపించాయి. ఆసీస్, భారత ఆటగాళ్లు ఒకే బబుల్‌లో ఉంటున్నారు. అలాంటప్పుడు ఆసీస్ ఆటగాళ్లు వాడిన లిఫ్ట్‌లను భారత ఆటగాళ్లు ఉపయోగించకూడదంటూ ఆదేశాలివ్వటం దేనికి సంకేతమో అర్థం కాలేదు. అలాంటి కఠిన పరిస్థితులను తట్టుకున్నాం. గబ్బాకు భారత్ రావటం లేదంటూ మరో నాటకానికి తెరతీశారు. అన్నీ ఓపికగా, సహనంగా ఎదుర్కొన్నాం.
శ్రీధర్:
మొత్తానికి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి ఆసీస్ ఆటగాళ్లు బ్యాటింగ్ తీసుకున్నారు. మొదటిరోజు తొలి అర్ధం పూర్తయ్యేటప్పటికీ 160/2 స్కోరు ఉన్న పరిస్థితుల్లో మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. తర్వాతి రోజు మన వాళ్ల ఫీల్డింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. రహానె అద్భుతమైన క్యాచును అందుకున్నాడు. జడేజా కళ్లు చెదిరే త్రోతో స్మిత్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. స్పిన్నర్లు లయ అందుకోవటం వల్ల 338 పరుగులకు ఆసీస్‌ను నియంత్రించగలిగాం. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సులువుగా 600 పరుగులు చేయగలిగే వికెట్ అది. అలాంటిది మన బౌలర్లు బాగా ఆకట్టుకున్నారు.
అశ్విన్:
రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి ఒకే ఇన్నింగ్స్ లో మూడు రనౌట్లు చేయటం 110 సంవత్సరాల రికార్డని బిగ్గరగా అరుస్తూ చెప్పాడు. కానీ గర్వపడొద్దని చెప్పాడు. కానీ పరిస్థితి దారుణంగా ఉంది. డ్రెస్సింగ్ రూమా లేదా ఆసుపత్రి వార్డ్‌లో ఉన్నామా తెలియదన్నట్లు ఆటగాళ్లకు ఎటు చూసినా గాయాలే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శ్రీధర్:
కనీసం కోచ్‌లకు ప్రత్యేకంగా రూం కేటాయించలేదు. ఆటగాళ్ల గదిలోనే కోచ్ బృందాన్ని కూర్చోమన్నారు. మ్యాచ్ చూసేందుకు సరైన అవకాశమే లభించలేదు. గిల్, పుజారా ఆదుకోవటం వల్ల 244 పరుగులు చేశాం. ఆసీస్ త్వరగా ఆడి డిక్లేర్ ఇచ్చేసింది.
అశ్విన్:
చివరి రెండురోజుల భారత పోరాటానికి నిదర్శనం. డ్రెస్సింగ్ రూంలో ఉన్న మీ ఫీలింగ్స్ ఏంటి?
శ్రీధర్:
నా జీవితంలో సిడ్నీ టెస్టు మ్యాచ్ రోజులు గుర్తుండిపోతాయి. ప్రత్యేకించి ఛెతేశ్వర్ పుజారా 205 బంతులు ఎదుర్కోవటం ఓ అద్భుతం.
అశ్విన్:
సాధారణంగా ఎవరైనా ఎక్కువ బంతులు తింటున్నారంటే చిరాకు వస్తుంది. కానీ టెస్టుల్లో పుజారా డిఫెన్స్ కోసం మ్యాచ్ చూడాలి. టిక్కెట్లకు పెట్టిన డబ్బుకు న్యాయం జరుగుతుంది.
శ్రీధర్:
చెక్కుచెదరని అంకితభావమది. బౌలర్ ఏం చేసినా వదిలేస్తాడు. చెయ్యి విరగొట్టినా.. కాలిని టార్గెట్ చేసినా వేళ్లు చితక్కొట్టినా, హెల్మెట్ ముక్కలు చేసినా ఏం చేసినా కదలడు,మెదలడు. అతడి ఆటలో ఉండే మ్యాజిక్ అది. ఆసీస్ స్పిన్నర్ లైయన్ నుంచి కెరీర్లో 500 పరుగులు పైన పిండుకున్న ఏకైక బ్యాట్స్‌మన్ పుజారా మాత్రమే. గాయపడినా నిలబడి పోరాడే యోధుడని అతడిని పిలవాలేమో.
అశ్విన్:
సిడ్నీ సెకండ్ ఇన్నింగ్స్‌లో పంత్ 97 పరుగులు గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. కానీ పంత్ విషయంలో రెండు అంశాలున్నాయి. ఒకటి అతడు ఆడితే ప్రత్యర్థుల్లో వణుకు పుడుతుంది. రెండు మన టీంకు భయమే. ఎప్పుడు అయిపోతాడో తెలియని దూకుడుతోనే ఉంటాడు.
శ్రీధర్:
పంత్ ఆడుతుంటే అందరికీ హార్ట్ ఎటాక్ వస్తుందని రవిశాస్త్రి అంటూనే ఉంటాడు. సొంతజట్టు, ప్రత్యర్థి జట్టు రెండింటినీ భయపెట్టగల ఆటగాడు పంత్ మాత్రమే అనుకుంటా(నవ్వుతూ). అతడికి అతడే బలం, బలహీనత రెండూ. ఆసీస్ గడ్డపై 55 సగటుతో బ్యాటింగ్ గణాంకాలు సాధించిన రిషబ్ ఆఘనత సాధించిన ఏకైక ఉపఖండపు ఆటగాడిగా నిలిచాడు.
అశ్విన్:
చివరి ఓవర్లకు వచ్చేసరికి పరిస్థితి ఏంటి?
శ్రీధర్:
అద్భుతంగా ఆడిన పుజారా, గెలిపించేస్తాడేమో అని సందేహం వచ్చేలా అద్భుతమైన బ్యాటింగ్ చేసిన పంత్ ఇద్దరూ ఔటయ్యారు. నిన్ను(అశ్విన్) గబ్బాలో చూడాలనుకుంటున్నాం అంటూ టిమ్ పైన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీరింకా 42ఓవర్లుపైనే ఆడాలి. విహారి ఎందుకు గాయంతో పరిగెడుతున్నాడు. జడేజాకు వేలు గాయమైంది ఆడలేని పరిస్థితుల్లో ఎందుకు రిస్క్ చేస్తున్నారంటూ రవిశాస్త్రి కంగారుపడిపోయారు. అశ్విన్ వేలికి కూడా గాయమైతే ఇంక నేనే ఆడాల్సి వస్తుందని రవి పదేపదే అంటుంటే అంతా నవ్వుకున్నాం. శార్దుల్ ఠాకూర్‌ని పిలిచి.. లైయన్‌ను అశ్విన్ ఎదుర్కోవాలని, ప్యాట్ కమిన్స్, స్టార్క్‌ను.. విహారి ఎదుర్కోవాలని చెప్పమని రవిశాస్త్రి ప్లాన్ చెప్పి పంపారు.
అశ్విన్:
అదే ప్లాన్ మేం అవలంబిస్తున్నాం. ఓవర్ల మధ్యలో విహారి తన ఏకాగ్రత గాడి తప్పుతోందని.. ప్లాన్ మార్చి తను స్పిన్నర్‌ను ఎదుర్కొంటానని, పేసర్లను నేను ఆడాలని అడిగాడు. దీంతో పరుగులు తీయక తప్పని సరి పరిస్థితులు ఏర్పడింది.
శ్రీధర్:
టీ టైం తర్వాత మా ఆనందం మెల్లగా పెరుగుతోంది. ప్రతి బంతినీ రవిశాస్త్రి దగ్గరగా గమనిస్తూ శభాష్ అంటూ డ్రస్సింగ్ అంతా దద్దరిల్లేలా అరుస్తున్నాడు. అలా దాదాపు మీ ఇద్దరి పరుగులకు 249 సార్లు శభాష్ అనటం లెక్కపెట్టాం.
అశ్విన్:
నేను, విహారి ఒకరికొరం ధైర్యం చెప్పుకున్నాం. ఎంత కష్టమైన బాల్ అయినా బాడీ అడ్డుపెట్టేయాలని ఆలోచించాం. డిఫెన్స్ మంత్రంతో బౌలర్లను నిరాశకు గురి చేశాం. తప్పనిసరి పరిస్థితుల్లోనే పరుగులు తీశాం. అది చాలా కష్టమైపోయింది. భరించలేని వెన్నునొప్పితో నేను, తొడకండరాలు కదలక విహారీ యాతన అనుభవించాం. చివరికి వచ్చేసరికి స్లో ఓవర్ రేట్‌కి కారణమవుతున్నామంటూ ఆసీస్ ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదు చేస్తున్నారు. మందులు వేసుకుంటున్నా, స్ప్రే కొట్టుకుంటున్నా అభ్యంతరాలు చెప్పారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. వాళ్లు ఇప్పటికే ఓడిపోయారని నేను విహారీతో అన్నాను. అలా చిరస్మరణీయ డ్రాను అందుకున్నాం. కష్టానికి తగిన ప్రతిఫలం. అద్భుతమైన ప్రశంసలు. ఇద్దరి కేరీర్ లో గుర్తుండిపోయే క్షణాలవి. ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన గబ్బా టెస్టు విశేషాలు వచ్చే వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను.
ఇదీ చూడండి : 'ఆ నిర్ణయంతోనే ఆసీస్‌కు భారత్ మాస్టర్ స్ట్రోక్'
ఇదీ చూడండి : 'అడిలైడ్ టెస్ట్ నాకు ఆఖరిది అనుకున్నా'