కరోనాపై జరుగుతోన్న పోరాటానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆ జట్టు ఆటగాడు ఏబీ డివిలియర్స్. 2016 ఐపీఎల్ సీజన్ ఓ మ్యాచ్‌లో వినియోగించిన బ్యాట్లు, జెర్సీలను వేలం వేయాలనుకున్నారు. దాని ద్వారా వచ్చిన నిధులను విరాళంగా ఇవ్వాలనుకున్నట్లు తెలిపారు. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ చాట్‌లో ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్మెన్లు చర్చించుకున్నారు.
2016 సీజన్లో గుజరాత్ లయన్స్‌పై మ్యాచ్‌లో ఆకుపచ్చ జెర్సీలతో బెంగళూరు ఆటగాళ్లు బరిలో దిగారు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ, డివిలియర్స్ శతకాలతో అలరించారు. అందులో వినియోగించిన బ్యాట్లను వేలం వేయాలని డివిలియర్స్, కోహ్లీతో అన్నాడు. కోహ్లీ సంతకంతో ఉన్న జెర్సీ, ఇరువురి బ్యాట్లు, గ్లవ్స్‌ను వేలానికి ఇస్తానని డివిలియర్స్ తెలిపాడు. దీని ద్వారా వచ్చిన నిధులను అన్నార్థుల ఆకలి తీర్చేందుకు ఉపయోగించాలని పేర్కొన్నాడు. దీనికి కోహ్లీ స్పందిస్తూ.. అద్భుతమైన ఆలోచనంటూ డివిలియర్స్‌ను ప్రశంసించాడు. వేలంలో వచ్చిన డబ్బును భారత్, దక్షిణాఫ్రికాలో ఉన్న పేదల కోసం వినియోగిస్తామని వారు వెల్లడించారు.
ఇదీ చూడండి.. భజ్జీని ఇబ్బందిపెట్టిన బ్యాట్స్‌మెన్ వీరే!