న్యూజిలాండ్ పర్యటనకు భారత్ వెళ్తుందంటే.. ముందుగా అక్కడి పిచ్‌ల గురించి.. వాతావరణ పరిస్థితుల గురించే చర్చ జరుగుతుంది. అస్థిరమైన బౌన్స్, స్వింగ్‌కు సహకరించే ఆ పిచ్‌లపై మనవాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారోనని అనుమానాలు వ్యక్తమవుతాయి. వేగంగా వీచే చల్లటి గాలులు బంతి గమనాన్ని మారుస్తాయని, స్వింగ్‌ను అంచనా వేయడం కష్టమని ముందే హెచ్చరికలు జారీ అవుతాయి. జాగ్రత్తగా ఆడకపోతే ఓటమి తప్పదనే సూచనలు వినిపిస్తాయి. అలాంటి కివీస్ పిచ్‌లపై.. బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసిరే పరిస్థితులను ఎదుర్కొని గౌతమ్ గంభీర్ నిలిచాడు. దాదాపు రెండు రోజుల పాటు క్రీజులో గడిపి ఓటమి దిశగా సాగుతున్న జట్టును గట్టెక్కించాడు. గంభీర్‌కు గొప్ప స్థాయిని అందించి, టీమ్‌ఇండియా చారిత్రక సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇన్నింగ్స్ అది.
2009లో భారత జట్టు కివీస్ పర్యటనకు వెళ్లింది. ధోని సారథ్యంలో కఠిన పరీక్షకు సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన భారత్ పది వికెట్ల తేడాతో గెలిచింది. ఆ గెలుపిచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత్, నేపియర్‌లో జరిగే రెండో టెస్టుకు సిద్ధమవగా.. ఈ మ్యాచ్‌లో నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ బరిలో దిగింది. పరాజయం నుంచి గొప్పగా పుంజుకున్న ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను ఓ ఆటాడుకుంది.
రైడర్ (201) ద్విశతకానికి తోడు టేలర్ (151), మెక్‌కలమ్ (115) శతకాలు చేయడంతో 619/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బదులుగా ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 305 పరుగులకే ఆలౌటైంది. ద్రవిడ్ (83), లక్ష్మణ్ (76) పోరాడారు. ఆ తర్వాత ఫాలోఆన్ మొదలెట్టిన జట్టు పదో ఓవర్లోనే సెహ్వాగ్ వికెట్ కోల్పోయింది. మూడో రోజు ఆట ఆఖరుకు స్కోరు 47/1. రెండు రోజుల ఆట మిగిలుంది. భారత్ ఇంకా 267 పరుగులు వెనుకబడి ఉంది. ఈ స్థితిలో ధోనీసేన మ్యాచ్‌ను కాపాడుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ సహచరులతో కలిసి గంభీర్ సాగించిన అసాధారణ పోరాటం వల్ల భారత్ మ్యాచ్‌ను డ్రాగా ముగించగలిగింది.
ద్రవిడ్ తర్వాత అతనే..
ఈ ఇన్నింగ్స్‌లో గంభీర్ చేసింది 137 పరుగులే. కానీ అందుకోసం ఏకంగా 436 బంతులాడాడు. దాదాపు 11 గంటలు క్రీజులో నిలిచాడు. మామూలుగా గంభీర్ కొంచెం దూకుడుగానే ఆడతాడు. ఇలా గంటలు గంటలు నిలిచి, దుర్భేద్యమైన డిఫెన్స్‌తో గోడ కట్టడం ద్రవిడ్ శైలి. కానీ ఆ రోజు మాత్రం 'వాల్' పాత్రను గంభీర్ పోషించాడు. అతడి పట్టుదల చూసి సీనియర్లలోనూ స్ఫూర్తి రగిలింది. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేసే దిశగా గంభీర్ పునాది వేస్తే.. మిగతా వాళ్లూ తమ వంతు పోరాటంతో జట్టును గట్టెక్కించారు.
ఆ ఇన్నింగ్స్‌లో బంతులు వదిలేయడానికి ఎంతమాత్రం సందేహించలేదు. ఆడిన బంతులన్నింటినీ మిడిల్ చేసే ప్రయత్నమే చేశాడు. ఆచితూచి బౌండరీలు కొట్టాడు. ఫీల్డర్లను దగ్గరగా మోహరించి ఒత్తిడి పెంచాలని ప్రయత్నించినా అతను వెనక్కి తగ్గలేదు. మంచి బంతులను గౌరవిస్తూ.. చెత్త బంతులను శిక్షిస్తూ బ్యాటింగ్ కొనసాగించాడు.
ద్రవిడ్ (62), సచిన్ (64), లక్ష్మణ్ (124 నాటౌట్)లతో కలిసి గంభీర్ కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ఎక్కడా సంయమనం కోల్పోకుండా జట్టును గట్టెక్కించే బాధ్యతను సమర్థంగా నెరవేర్చాడు. ఇంకో గంటన్నర మాత్రమే ఆట మిగిలుండగా, ఇన్నింగ్స్ 160వ ఓవర్లో, జట్టు స్కోరు 356 వద్ద అతను నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత లక్ష్మణ్, యువరాజ్ సింగ్ (54 నాటౌట్) అజేయంగా నిలిచారు. భారత్ అయిదో రోజు ఆట ఆఖరుకు 476/4తో నిలిచి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే గంభీర్ వికెట్ కోల్పోయి ఉంటే ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పకపోయేదేమో. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూజిలాండ్ గడ్డపై టీమ్‌ఇండియాకు సిరీస్ విజయమూ దక్కేది కాదేమో.
బ్యాట్స్‌మెన్ : గౌతమ్ గంభీర్
పరుగులు : 137
బంతులు : 436
బౌండరీలు : 18 ఫోర్లు
ప్రత్యర్థి : న్యూజిలాండ్
ఫలితం : మ్యాచ్ డ్రా
సంవత్సరం : 2009
ఇదీ చూడండి.. టీ20ల్లో ఆ రికార్డు వారికే సాధ్యం: యువీ