పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు.. వీలు చిక్కినప్పుడు టీమిండియాపై విషం కక్కుతూనే ఉన్నారు. ఇటీవల పీసీబీ బోర్డు ఛైర్మన్ ఎహెసన్.. భారత్‌లో భద్రతా లేదని పరోక్షంగా అనడం మరువక ముందే, మరో మాజీ క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీని విమర్శించాడు. ఏటా నాలుగు మెగా జట్లు కలిసి టోర్నీ ఆడాలనే దాదా ప్రపోజల్‌ను ఫ్లాప్ ఐడియా అని అన్నాడు పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్.
"నాలుగు దేశాలు కలిసి ఓ టోర్నీ ఆడాలనుకోవడం ఇతర జట్లను వేరుచేయడమే అవుతుంది. మిగతా దేశాలకు ఇది ఏ మాత్రం మంచి వార్తకాదు. బిగ్ త్రీ మోడల్ సిరీస్‌లా ఇదీ ఫ్లాప్ ఐడియాగా మిగిలిపోతుందని నాకు అనిపిస్తుంది" - రషీద్ లతీఫ్, పాక్ మాజీ కెప్టెన్
అత్యంత ధనిక బోర్డులైన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కలిసి 'ద బిగ్ త్రీ మోడల్' అనే అంశాన్నికొన్నేళ్ల క్రితం తెరపైకి తెచ్చాయి. దీని ప్రకారం ఐసీసీ రెవిన్యూలో మిగతా దేశాల కంటే గరిష్ఠ భాగం ఈ మూడు దేశాలకు రావాలి. ఐసీసీ.. కొన్ని రోజుల తర్వాత దీన్ని రద్దు చేసింది.
ఏటా ఒక ఐసీసీ టోర్నీ నిర్వహించాలని చూస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయానికి వ్యతిరేకంగా నాలుగు మెగా జట్ల టోర్నీ నిర్వహించడానికి బీసీసీఐ ముందడుగు వేసింది. అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇదివరకే ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డును(ఈసీబీ) సంప్రదించి ఈ విషయాన్ని ప్రతిపాదించాడు. ఇందుకు ఈసీబీ సుముఖత వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: 'బీసీసీఐ ప్రపోజల్‌పై ఇతర జట్లతో చర్చిస్తాం'