డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఆడితే ఆసీస్ తిరిగి ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. వారిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లని... రాబోయే టోర్నీలో సత్తా చాటుతారని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నారు వార్నర్, స్మిత్. ఫలితంగా, ఏడాది పాటు నిషేధానికి గురయ్యారీ కంగారూ ఆటగాళ్లు. వచ్చే నెలతో ఈ బహిష్కరణ పూర్తి కానుంది. ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండే అవకాశముందని భావిస్తున్నారు.
ఫామ్‌పై సందేహాలు...
ఇటీవలే ఇద్దరు ఆటగాళ్లకి మోచేతి శస్త్రచికిత్స జరిగింది. ఏడాది పాటు బహిష్కరణ, అనంతరం సర్జరీతో వారిరువురి ప్రపంచ కప్ ప్రదర్శన సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడతారో లేదో అనే సందిగ్ధత మొదలైంది.
ఈ విషయంపై షేన్ వార్న్ స్పందించాడు. 2003లో నిషేధిత మాదక ద్రవ్యాలు వాడి ఏడాది పాటు ఆటకు దూరమైనా... పురోగమనంలో సత్తా చాటానని గుర్తుచేశాడు వార్న్. నూతనోత్సాహంతో అద్భుత ప్రదర్శన చేశానని తెలిపాడు. ఇదే విధంగా వార్నర్, స్మిత్ అత్యుత్తమంగా ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
వార్నర్, స్మిత్ రానున్న ఐపీఎల్లో సత్తా చాటి ప్రపంచకప్ కల్లా సిద్ధమవుతారని ఆస్ట్రేలియా సహాయక కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారని చెప్పాడు.