ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్ సంచలనం సృష్టించింది. మైదానంలో వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకునే సారా ఒంటిపై బట్టలేమీ లేకుండా కీపింగ్ చేస్తున్న ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. మహిళల శరీరం, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఈ పని చేసినట్టు పేర్కొంది.
"నా గురించి తెలిసిన వాళ్లు.. నేను నా పరిధి నుంచి బయటకొచ్చానని అనుకోవచ్చు. కానీ ఇలా ఉన్నందుకు గర్వంగా ఉంది. శరీరానికి సంబంధించి సమస్యలు నన్ను ఎప్పుడూ వెంటాడేవి. వాటిలో కొన్ని అధిగమించి సాధికారత సాధించాను. నన్ను ఇందులో భాగం చేసినందుకు ఉమన్ హెల్త్ యూకేకు ధన్యవాదాలు. ప్రతి మహిళా అందంగా ఉంటారనేది గుర్తుపెట్టుకోండి" -సారా టేలర్, ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్.
అతిగా ఆందోళన చెందడం(యాంగ్జైటీ) అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న సారా... ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంది. 2016లోనూ ఇదే కారణంగా విరామం తీసుకుంది. ఐసీసీ ఉమెన్ టీ-20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా మూడు సార్లు(2012, 2013, 2018) ఎంపికైంది. 2014లో ఐసీసీ ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచింది. 89 టీ 20ల్లో 2వేల పైచిలుకు పరుగులు చేసింది. 121 వన్డేల్లో 3,958 పరుగులు చేసింది. ఇందులో 7 శతకాలు ఉన్నాయి.
ఇది చదవండి: ఆగస్టు 16న టీమిండియా కోచ్ ప్రకటన..!