ఆస్ట్రేలియా-భారత్ మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకాబోతుంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాడు కంగారూ జట్టు మాజీ ఆటగాడు రికీ పాంటింగ్. ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించిన పాంటింగ్ పలు విషయాలను పంచుకున్నాడు.
రాబోయే సిరీస్‌లో ఎవరు గెలుస్తారని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు "వన్డే ప్రపంచకప్, తాజా టెస్టు సిరీస్‌ల విజయాలతో ఆస్ట్రేలియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. అయితే, గతేడాది ఐదు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఈ సారి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. నేను ఆస్ట్రేలియా 2-1 తేడాతో విజయం సాధిస్తుందని భావిస్తున్నా" అని పాంటింగ్ వివరించాడు.
అలాగే ఒక నెటిజన్ ట్వీట్ చేస్తూ "టీమిండియా ఉపసారథి రోహిత్‌శర్మతో కలిసి ఐపీఎల్లో పని చేసిన అనుభవంతో అతనికి ఎంత రేటింగ్ ఇస్తారు" అని అడిగిన ప్రశ్నకు పాంటింగ్ చక్కటి జవాబిచ్చాడు. "రోహిత్‌కు ఒక బ్యాట్స్‌మన్‌గా, ఒక కెప్టెన్‌గా అత్యద్భుతమైన రేటింగ్ ఇస్తా. ఈ విషయాన్ని ఐపీఎల్లో అతను సాధించిన కెప్టెన్సీ రికార్డులే తెలియజేస్తాయి" అని వివరించాడు.
ఈ సందర్భంగా ఆ జట్టు టెస్టు క్రికెటర్ లబుషేన్ గురించి మరో వ్యక్తి అడగ్గా "రాబోయే సిరీస్‌లో అతను మిడిల్ ఆర్డర్‌లో అత్యుత్తమంగా ఆడతాడు. స్పిన్‌పై దాడి చేస్తాడు. వికెట్ల మధ్య బాగా పరిగెడతాడు. అలాగే లెగ్‌స్పిన్‌తో కూడా ఆకట్టుకుంటాడు. లబుషేన్ గురించి చాలా ఆసక్తి నెలకొంది" అని చెప్పుకొచ్చాడు.
ఇవీ చూడండి.. :'సైనా.. అకాడమీని వీడడం కలచివేసింది'