టీమ్‌ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానెను పాలల్లో పడిన ఈగలా తీసిపారేశారని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కెరీర్‌లో మొత్తం 90 వన్డేలాడిన రహానె 35.26 సగటుతో 2962 పరుగులు చేశాడు. అందులో నాలుగో నంబర్ ఆటగాడిగా 27 మ్యాచ్‌ల్లో 843 పరుగులు చేయగా, ఓపెనర్‌గా 54 మ్యాచ్‌ల్లో 1937 పరుగులు సాధించాడు. ఈ గణంకాలే అతడి బ్యాటింగ్ సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే 2018లో దక్షిణాఫ్రికాతో ఆడాక టీమ్‌ఇండియా అతడిని పక్కనపెట్టింది. ఈ విషయంపై స్పందించిన చోప్రా.. కొన్ని వైఫల్యాలు చూసి అతడిని తీసేయడం సరైన నిర్ణయం కాదన్నాడు. అతడికి మరిన్ని అవకాశాలిచ్చి వేచి చూడాల్సిందని చెప్పాడు.
"నాలుగో స్థానంలో రహానె గణంకాలు బాగున్నాయి. ఆ స్థానంలో నిలకడగా ఆడుతూ 94 స్ట్రైక్‌రేట్ కలిగిన ఆటగాడికి ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు? ఉన్నపళంగా అతడిని తొలగించారు. అదెలా ఉందంటే పాలల్లో పడిన ఈగను తీసిపారేసినట్లు వదిలేశారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అలా చేయడం అతడిపట్ల అమానుషంగా ప్రవర్తించడమేనని నేను అనుకుంటున్నా. ప్రతి మ్యాచ్‌లో 350 పరుగులు సాధించే ఇంగ్లాండ్ జట్టులా టీమ్‌ఇండియా మారి ఉంటే బాగుండేది. వాళ్లు అలాగే ఆడతారు. వాళ్లు మ్యాచ్ గెలిచారా లేదా అని పట్టించుకోరు. అయితే, భారత జట్టును మనం అంతలా తీర్చిదిద్దలేదు. ఇంకా మనం సంప్రదాయమైన ఆటనే ఆడుతున్నాం. 325 పరుగులు చేసే జట్టునే ఎంపిక చేస్తున్నాం."
-ఆకాశ్ చోప్రా, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
బాగా ఆడుతున్న రహానెను వన్డేల నుంచి తప్పించడం సరికాదని, అది తప్పుడు నిర్ణయమని పేర్కొన్నాడు ఆకాశ్. దక్షిణాఫ్రికాలో అతడు మంచిగా ఆడినా తప్పించారని, అప్పుడే మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని చోప్రా చెప్పుకొచ్చాడు. 2014లో రోహిత్‌శర్మ గాయం కారణంగా తప్పుకోడం వల్ల రహానె తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆసియాకప్‌లో పలుమార్లు అర్ధశతకాలు కూడా సాధించాడు. తర్వాత ఇంగ్లాండ్ జట్టుపైనా అద్భుతమైన శతకం బాదాడు. 2017లో ఆస్ట్రేలియాపై నాలుగు అర్ధశతకాలు బాదిన అతడు తర్వాత అదే ఊపులో దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి వన్డేలో 79 పరుగులు చేశాడు. ఆ తర్వాత వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలమవడం వల్ల అతడిని పక్కనపెట్టేశారు. 2019 ప్రపంచకప్ ముందు నాలుగో నంబర్ ఆటగాడు అవసరమైన సందర్భంలోనూ రహానెను పట్టించుకోలేదు. దీంతో అతడు గతేడాది సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు.