టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని వెనకేసుకొచ్చాడు వైస్ కెప్టెన్ అజింక్య రహానె. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఓటమి తర్వాత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్‌పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దానిని సమర్థించిన రహానె.. కెప్టెన్‌గా విరాట్‌పై వస్తున్న విమర్శలను వర్చువల్ మీడియా సమావేశంలో తిప్పికొట్టాడు.
"మైదానంలో అన్ని సార్లు ఒకే స్థాయి సత్తువతో ఉండటం సాధ్యపడదు. తొలి టెస్టులో శక్తి కోల్పోవడానికి కారణం కెప్టెన్ మారడం కాదు. విరాట్.. ఇప్పటికీ, ఎప్పటికీ నాకు కెప్టెన్‌గానే ఉంటాడు. మీకు ఇక్కడ ఎలాంటి మసాలా దొరకదు."
- అజింక్య రహానే, టీమ్ఇండియా వైస్కెప్టెన్
బయటి వ్యక్తుల మాటలు పట్టించుకోం..
ఇక తొలి టెస్టులో 6, 12 పరుగులతో నిరాశపరిచిన రోహిత్ శర్మతో పాటు నెమ్మదిగా ఆడే పుజారాకు బాసటగా నిలిచాడు రహానె. వారిపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చాడు. "రోహిత్ శర్మ.. టీమ్‌లో చాలా ముఖ్యమైన ఆటగాడు. పెద్ద స్కోర్ అంటే సెంచరీ చేయాలని కాదు. ఆస్ట్రేలియాలో అతడు విలువైన సేవలందించాడు. 1, 2 మ్యాచ్‌లు లేదా 4-6 ఇన్నింగ్స్‌ల్లో ఒక ఆటగాడి సామర్థ్యాన్ని నిర్ణయించకూడదు. ఇక పుజారా ఆటతీరుపై (నిదానంగా ఆడటం) జట్టులో ఎవరికీ అభ్యంతరం లేదు. అది ముఖ్యం. బయటి వ్యక్తుల మాటలు మాకు అవసరం లేదు. అతడు ఎంతో కీలకమైన ఆటగాడు. ఆస్ట్రేలియాలో చూశాం. ఇప్పుడూ చూస్తున్నాం. అతడి పట్ల జట్టు సంతృప్తికరంగా ఉంది." అని రహానె అన్నాడు.
బౌలర్ల పట్ల సంతృప్తికరం..
టెస్టులో స్పిన్నర్ల ప్రదర్శన పట్ల ఆందోళన లేదని చెప్పాడు రహానె. "తొలి టెస్టులో మొదటి రెండు రోజులు పిచ్ బౌలర్లకు సహకరించలేదు. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి మా బౌలర్లు, ప్రత్యేకించి అశ్విన్ బాగా రాణించాడు. మా స్పిన్నర్ల పట్ల ఎలాంటి ఆందోళనలేదు. ఫీల్డింగ్‌పై ఇంకాస్త దృష్టి సారించాం. ఇక తుది జట్టులో ఎవరు ఉంటారనేది కచ్చితంగా చెప్పలేం. అక్షర్ పటేల్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. తొలి మ్యాచ్ ఫలితం గురించి మర్చిపోయి బాగా రాణించాలని అనుకుంటున్నాం." అని చెప్పాడు రహానె.
పిచ్ పరిస్థితిపై..
రెండో టెస్టుకోసం పిచ్ భిన్నంగా ఉందని రహానె చెప్పాడు. తొలి రోజు నుంచే మంచి టర్న్ లభిస్తుందని అన్నాడు. అయితే తొలి సెషన్ గడిస్తే గానీ పిచ్ ఎలా స్పందిస్తుందో చెప్పలేమని అన్నాడు. ఉత్తరాఖండ్ మాజీ కోచ్ వసీమ్ జాఫర్ విషయంపై తనకు అవగాహన లేదన్నాడు రహానె. వారిద్దరూ ముంబయి, పశ్చిమ జోన్లకు గతంలో కలిసి ఆడారు.