ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ బిడ్డింగ్ రేసులో యోగా గురు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి పాల్గొననున్నట్లు సమాచారం. ఇటీవలే చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఈ ఒప్పందం నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. స్పాన్సర్షిప్ విషయంలో ప్రాధాన్యం సంతరించుకుంది.
"పతంజలి బ్రాండ్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను పరిశీలిస్తున్నాం" అని సంస్థ ప్రతినిధి ఎస్కే టిజారావాలా ఇటీవలే ఓ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ప్రతిపాదనను బీసీసీఐ ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
దేశంలో ప్రస్తుతం చైనా వ్యతిరేక భావన తీవ్రంగా ఉన్నందున వివోతో కుదుర్చుకున్న ఒప్పందానికి బీసీసీఐ స్వస్తి పలికింది. మరోవైపు బోర్డుకు నిధులు సమకూరుస్తున్న ఇతర చైనా కంపెనీ స్పాన్సర్లపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పతంజలి వంటి స్వదేశీ సంస్థతో ఈ సమస్యలన్నింటికీ తెరపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
పతంజలితో పాటు అమెజాన్, టాటా గ్రూప్, డ్రీమ్ 11, జియో, అదానీ, బైజూ సహా అనేక బ్రాండ్లు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం పోటీ పడుతున్నాయి.