క్రికెట్లో సరికొత్త నిర్ణయాలతో ముందుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఐసీసీ. ఇందులో భాగంగానే ఇటీవల టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించింది. టెస్టుల నిడివిని ఐదు నుంచి నాలుగు రోజులకు కుదించాలని ప్రతిపాదన కుడా చేసింది. అయితే దీనిపై పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు వ్యతిరేకించారు. తాజాగా మరో కీలక నిర్ణయానికి తెరలేపింది. టీ20 ప్రపంచకప్‌ల్లో 16 జట్లు బదులు 20 జట్లకు అవకాశమివ్వాలని భావిస్తోంది.
ఎంపిక ఎలా..?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)... టీ20 ప్రపంచకప్‌లో తలపడే జట్ల సంఖ్యను పెంచాలనుకుంటోంది. ప్రస్తుతం 16 జట్లతో టోర్నీని నిర్వహిస్తుండగా మరో నాలుగింటికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. 2023-31 మధ్య జరిగే టీ20 ప్రపంచకప్‌లను 20 జట్లతోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ షెడ్యూల్‌లో తొలి మెగా టోర్నీ 2024లో జరుగుతుంది.
రెండు విధాలుగా ఈ ఈవెంట్‌ను నిర్వహించే అవకాశాలున్నాయి. ఒకటి చిన్న జట్లకు క్వాలిఫయర్స్ నిర్వహించి అర్హత సాధించిన జట్లను మొయిన్ డ్రాలో ఆడించడం. రెండోది ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి టోర్నీ నిర్వహించడం.