మోకాలి గాయంతోనే 2015 ప్రపంచకప్‌లో ఆడినట్లు చెప్పాడు టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ షమీ. నడవలేని పరిస్థితిలోనూ నొప్పిని భరించే మందులతో పాటు ఇంజెక్షన్లను తీసుకున్నానని తెలిపాడు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు.
"కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అలాంటి పరిస్థితే నాకు ఎదురైంది. ఆ సమయంలో మోకాలి గాయంతో కనీసం నడవలేకపోయా. ఫిజియో నితిన్ పటేల్ సలహాతో నొప్పిని భరించడానికి మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకున్నా. ఆ టోర్నీలో ఆడటానికి అవే ధైర్యాన్నిచ్చాయి. మోకాలి గాయానికి ఆపరేషన్ అవసరం. అయితే నొప్పిని భరించగలిగితేనే ప్రపంచకప్ ఆడగలవని వారు తెలిపారు."
- మహ్మద్ షమీ, టీమ్ఇండియా పేసర్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనపై నమ్మకం ఉంచాడని, తన కెరీర్ కఠినమైన దశలో అతడు ప్రేరణ కలిగించాడని షమీ తెలిపాడు.
"సెమీఫైనల్లో తొలుత ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులిచ్చా. తర్వాత ధోనీకి చెప్పి వెళ్లిపోదామనుకున్నా. ఇంజెక్షన్ తీసుకున్నా నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక బౌలింగ్ చేయలేనని ధోనీతో చెప్పా. అయితే, ధోనీ నన్ను నమ్ముతున్నానని చెప్పాడు. పార్ట్ టైమ్ బౌలర్లకు బంతినిచ్చినా వాళ్లు పరుగులిస్తారని చెప్పాడు. 60 పరుగుల కంటే ఎక్కువ ఇవ్వొద్దని అన్నాడు"
- మహ్మద్ షమీ, టీమ్ఇండియా పేసర్
2015 ప్రపంచకప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో షమీ 17 వికెట్లు సాధించాడు. ఆ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఉమేశ్ యాదవ్ 18 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.
ఇదీ చూడండి.. 'రోహిత్ భారీ షాట్లు అలవోకగా ఆడతాడు'