శ్రీలంక క్రికెట్ జట్టు దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితాధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఈ బయోపిక్ టైటిల్‌ను '800'గా నామకరణం చేసింది చిత్రబృందం. ప్రధానపాత్రలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.
మంగళవారం.. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్స్ స్పోర్ట్స్ 1 తమిళ్ ఛానెళ్లలో ఆ మ్యాచ్ ముందు జరగనున్న కార్యక్రమంలో విజయ్ సేతుపతి, ముత్తయ్య మురళీధరన్ పాల్గొని '800' చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఎమ్ఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి.. స్పిన్నర్‌గా ముత్తయ్య మురళీధరన్ తీసిన వికెట్ల సంఖ్య(800)ను టైటిల్‌గా పెట్టారు.
ఈ సినిమాపై ముత్తయ్య మురళీధరన్ తన అభిప్రాయాన్ని స్టార్ స్పోర్ట్స్ ప్రీ-మ్యాచ్షో 'క్రికెట్ లైవ్' ద్వారా తెలియజేశారు.
"సినిమా స్క్రిప్ట్ అంతా సిద్ధమైనప్పుడు నా పాత్రకు ఎవరైతే సరిపోతారనే చర్చ వచ్చింది. నా పాత్రలో నటించడానికి విజయ్ సేతుపతి సరైన వ్యక్తి. నాకు తెలిసి అతను చాలా ప్రతిభ గల నటుడు. నేను బౌలింగ్ వేసే హావభావాలను సరిగ్గా పలికాడు. అతని మీద నాకు పూర్తి నమ్మకముంది."
- ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక మాజీ స్పిన్నర్
ముత్తయ్య మురళీధరన్ లాంటి వ్యక్తి బయోపిక్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందన్నాడు నటుడు విజయ్ సేతుపతి. "ముత్తయ్య మురళీధరన్ ఓ స్టాంప్ లాంటివాడు. ఎక్కడికి వెళ్లినా తన వ్యక్తిత్వంతో తనదైన ముద్ర వేసుకుంటాడు. అతని నిజ జీవితం గురించి విన్నాను. మైదానంలో వ్యక్తిత్వం చాలా కొంతమందికే తెలుసు.. కానీ, అతని మనస్తత్వం గురించి అందరికి తెలియకపోవచ్చు. అతని గురించి అందరికి తెలియాల్సిన అవసరం ఉంది" అన్నాడు.
2021లో విడుదల
'800' చిత్రీకరణను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. శ్రీలంక, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, భారత్‌లలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. 2021 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
తమిళ్ తప్ప...
ఈ బయోపిక్‌ను ప్రధానంగా తమిళంలో నిర్మించి.. దక్షిణాది భాషలతో పాటు హిందీ, బెంగాలీ, సింహళీస్లో డబ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అంతర్జాతీయంగా రిలీజ్ చేయనున్నారు.