ఈ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. టీమ్ఇండియాకు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్(పురుషులు) సహా దశాబ్దపు వన్డే క్రికెటర్గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ చేసిన 70 సెంచరీల్లో 66 శతకాలు, 48 హాఫ్సెంచరీల్లో 39 అర్ధశతకాలు ఈ దశాబ్దంలోనే చేయటం వల్ల అతడికి క్రికెట్ అత్యున్నత పురస్కారం లభించింది. ఈ కాలంలోనే అత్యధిక అర్ధశతకాలు(94), 56.97 సగటుతో 20,396 పరుగులు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో 12,040, టెస్టుల్లో 7,318, టీ20ల్లో 2,928 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో ఉన్న బ్యాట్స్మన్గా ఘనత సాధించాడు. 2011 ప్రపంచకప్ విజేత నిలిచిన జట్టులో కోహ్లీ భాగస్వామి కావడం విశేషం.
"ఈ అత్యుత్తమ అవార్డును అందుకోవడం నాకు దక్కిన గౌరవం. ఈ దశాబ్దంలో 2011లో ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో గెలిచిన క్షణాలు నా మనసుకు హత్తుకున్నాయి. టెస్టుల కంటే ముందే వన్డేల్లో ఆడాను. అంతర్జాతీయంగా తొలి వన్డే ఆడిన రెండేళ్ల తర్వాత టెస్టుల్లో అవకాశం లభించింది. నా కెరీర్లో గణాంకాలు నమోదు చేయడం కంటే విజయంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాను"
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
ఐసీసీ దశాబ్దపు స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డుకు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎంపికయ్యాడు. 2011లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో బ్యాట్స్మన్ ఇయాన్ బెల్ రనౌట్ అయినా కెప్టెన్ ధోనీ, అతడిని తిరిగి మైదానంలోకి పిలిచి ఆడమని చెప్పాడు. ఆ సంఘటన క్రికెట్ అభిమానుల మనసును దోచింది. దీంతో దశాబ్దపు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును మహీ గెల్చుకున్నాడు.
నం. | అవార్డు | క్రికెటర్ | దేశం |
1. | దశాబ్దపు వన్డే క్రికెటర్ (పురుషులు) | విరాట్ కోహ్లీ | భారత్ |
2. | దశాబ్దపు టీ20 క్రికెటర్ (పురుషులు) | రషీద్ ఖాన్ | అఫ్గానిస్థాన్ |
3. | దశాబ్దపు టెస్టు క్రికెటర్ (పురుషులు) | స్టీవ్ స్మిత్ | ఆస్ట్రేలియా |
4. | ఐసీసీ దశాబ్దపు పురుష క్రికెటర్ (సర్ గారీఫీల్డ్ సోబెర్స్ అవార్డు) | విరాట్ కోహ్లీ | భారత్ |
5. | దశాబ్దపు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ | ఎంఎస్ ధోనీ | భారత్ |
6. | దశాబ్దపు వన్డే క్రికెటర్ (మహిళలు) | ఎల్లీస్ పెర్రీ | ఆస్ట్రేలియా |
7. | దశాబ్దపు టీ20 క్రికెటర్ (మహిళలు) | ఎల్లీస్ పెర్రీ | ఆస్ట్రేలియా |
8. | ఐసీసీ దశాబ్దపు మహిళా క్రికెటర్ (రాచెల్ హేహోయ్ ఫ్లింట్ అవార్డు) | ఎల్లీస్ పెర్రీ | ఆస్ట్రేలియా |
ఇదీ చూడండి: ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో సుమిత్ నగాల్