క్రికెట్ ప్రేమికుల దృష్టి ప్రస్తుతం టెస్టు ఛాంపియన్‌షిప్‌పైనే ఉంది. ఈ ఏడాది జూన్‌లో జరగబోయే ఆ టోర్నీ ఫైనల్‌కు న్యూజిలాండ్ ఇప్పటికే అర్హత సాధించింది. అయితే మరో స్థానం కోసం మూడు జట్లు బరిలో ఉన్నాయి. అందులో ప్రధానంగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్ కనిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి ఈ జట్ల మధ్యే టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టనుంది. దీంతో ఈ సిరీస్‌లో కచ్చితంగా గెలుపొందాలని టీమ్ఇండియా, ఇంగ్లాండ్.. తీవ్రంగా శ్రమించడం సహా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా చారిత్రక విజయం సాధించగా.. శ్రీలంకపై టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయాలతో ఇరుజట్లు మంచి జోరు మీదున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలి టెస్టు శుక్రవారం నుంచి జరగనుంది.
టీమ్ఇండియాకు అదే ప్లస్
1952లో చెపాక్ వేదికగా, ఇంగ్లాండ్‌పై టెస్టులో గెలిచి.. స్వదేశంలో తొలి విజయాన్ని టీమ్ఇండియా అందుకుంది. ఈ స్టేడియంలో ఇంగ్లీష్ జట్టుతో తలపడిన 9 మ్యాచ్‌ల్లో ఐదింటిలో భారత్ గెలవగా.. మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. ఒకటి డ్రా అయ్యింది. ఇప్పటివరకు జరిగిన టెస్టు గణాంకాలు పరిశీలిస్తే ప్రస్తుత సిరీస్‌లోనూ కోహ్లీసేనదే పైచేయి కావొచ్చని తెలుస్తోంది.
కలిసొచ్చిన చెపాక్
ఈ స్టేడియంలో జరిగిన టెస్టులన్నీ చూస్తే.. టీమ్ఇండియా 32 మ్యాచ్‌లాడి 14 గెలిచి, 6 టెస్టుల్లో ఓడింది. మిగిలిన 11 డ్రా, అనూహ్యంగా ఓ మ్యాచ్ టై అయ్యింది.
బ్యాటింగ్ పిచ్
చెపాక్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం! 2016లో ఇదే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో రికార్డు స్థాయిలో 759/7 (డిక్లేర్డ్) స్కోరు చేసింది భారత్. ఇదే స్టేడియంలో ఇంగ్లాండ్ అత్యధికంగా 652/7 (డిక్లేర్డ్) (1985) పరుగులు కూడా ఉన్నాయి. అత్యల్పంగా 159 స్కోరు(1973లో) కూడా ఇక్కడ నమోదు కావడం విశేషం.
చివరిసారిగా
2016లో చెపాక్‌లో చివరిసారిగా ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా తలపడింది. ఈ మ్యాచ్‌లో గెలిచి, ఐదు టెస్టుల సిరీస్‌ను 4-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది భారత్. అప్పటికి మూడో అంతర్జాతీయ టెస్టు మాత్రమే ఆడుతున్న కరుణ్ నాయర్.. 303 పరుగులతో త్రిశతకం సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. అతడి కంటే ముందు సెహ్వాగ్ ఉన్నాడు. కరుణ్ ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియా కెరీర్లోనే అత్యధిక స్కోరు (759/7 పరుగులు) నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 75 పరుగుల తేడాతో ఓడించింది.
30 ఏళ్లుగా అక్కడ గెలవలేదు
ఆస్ట్రేలియాలో గబ్బా స్టేడియంలోనూ కంగారూలకు 32 ఏళ్లుగా ఎదురేలేదు. కానీ, ఇటీవల జరిగిన టెస్టులో అజింక్య రహానె నాయకత్వంలోని టీమ్ఇండియా విజయకేతనం ఎగురవేసింది. అదే విధంగా చెపాక్ స్టేడియంలో 30 ఏళ్లుగా ఇంగ్లాండ్‌కు విజయమే దక్కలేదు. ఒకవేళ చెన్నైలో ఇంగ్లాండ్ సరికొత్త చరిత్ర ఏమైనా సృష్టిస్తుందేమో చూడాలి?
భారత్ Vs ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టులు
మ్యాచ్‌లు: 122
టీమ్ఇండియా గెలిచినవి: 26
ఇంగ్లాండ్ గెలిచినవి: 47
డ్రా మ్యాచ్‌లు: 49
టై మ్యాచ్‌లు: 0
ఇరు జట్లు తలపడిన చివరి మూడు సిరీస్‌లు
2018: టీమ్ఇండియాపై 4-1 తేడాతో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ గెలిచింది.
2016-17: స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 4-0 తేడాతో టీమ్ఇండియా నెగ్గింది.
2014: ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ సిరీస్‌లో భారత్‌పై 3-1 తేడాతో ఆతిథ్య జట్టు విజయం సాధించింది.
(జరిగిన గత మూడు సిరీస్‌ల్లోనూ ఆతిథ్య జట్టుదే పైచేయి కావడం విశేషం)
టీమ్ఇండియా
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్థానం: 2
టాప్-ర్యాంక్ బ్యాట్స్‌మన్: విరాట్ కోహ్లీ (4)
టాప్-ర్యాంక్ బౌలర్: రవిచంద్రన్ అశ్విన్ (8)
ఇంగ్లాండ్
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జట్టు స్థానం: 4
టాప్-ర్యాంక్ బ్యాట్స్‌మన్: జో రూట్ (5)
టాప్-ర్యాంక్ బౌలర్: స్టువర్ట్ బ్రాడ్ (2)
టీమ్ఇండియా Vs ఇంగ్లాండ్ సిరీస్ షెడ్యూల్:
తొలిటెస్టు: ఫిబ్రవరి 5-9 (చెన్నై)
రెండో టెస్టు: ఫిబ్రవరి 12-17 (చెన్నై)
మూడో టెస్టు: ఫిబ్రవరి 24-28 (అహ్మదాబాద్)
నాలుగో టెస్టు: మార్చి 4-8 (అహ్మదాబాద్)
ఇదీ చూడండి: టీమ్ఇండియా.. ఇంగ్లాండ్ యోధులతో జాగ్రత్త!