జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. 79 పరుగుల చేసిన గేల్... పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వేగంగా పరుగులు చేస్తున్న రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ బట్లర్‌ను అశ్విన్ 'మన్కడింగ్'తో ఔట్ చేయడం ఈ మ్యాచ్‌లో వివాదాస్పదమైంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు తొలి ఓవర్లోనే ఎదురదెబ్బ తగిలింది. 4 పరుగులు చేసిన రాహుల్ అవుటయ్యాడు. తర్వాత గేల్‌తో కలిసిన మయాంక్ రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వేగంగా ఆడిన గేల్ 47 బంతుల్లో 79 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన సర్ఫరాజ్ 29 బంతుల్లో 46 పరుగులు పంజాబ్‌కు 184 పరుగుల భారీ స్కోరు అందించాడు.
ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గేల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 112 ఇన్నింగ్స్‌ల్లోనే 4వేల పరుగులు సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
రాజస్థాన్ బౌలర్లలో స్టోక్స్ 2 వికెట్లు తీయగా, కులకర్ణి, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ తీశారు.
రెండో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కు ఓపెనర్లు ఇద్దరూ శుభారంభం అందించారు. రహానే, బట్లర్ కలిసి తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 27 పరుగులు చేసి రహానే అవుటయ్యాడు. వేగంగా ఆడుతున్న బట్లర్‌ను వివాదాస్పద రీతిలో మన్కడింగ్ చేసి అశ్విన్ అవుట్‌చేశాడు.
తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు నిలువలేకపోయారు. సంజూ శాంసన్ 30, స్మిత్ 20 పరుగులు చేసి సామ్ కరన్ బౌలింగ్‌లో అవుటయ్యారు. మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లకు 170 పరుగులు చేసి ఆలౌటైంది రాజస్థాన్.
పంజాబ్ బౌలర్లలో కరన్, ముజీబుర్ రెహ్మాన్, అంకిత్ రాజ్‌పుత్ తలో రెండు వికెట్లు తీశారు. కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశాడు.