ఆస్ట్రేలియా పర్యటన ఎంపిక నుంచి ఇప్పటివరకు 13 మంది భారత ఆటగాళ్లు గాయపడ్డారు. సిడ్నీ టెస్టులో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకు గాయాలయ్యాయి. అయితే వీరంతా ఇంతలా గాయపడటానికి సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఐపీఎల్ నిర్వహించడమే కారణమని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు.
"ఎంతోమంది ఆటగాళ్లు గాయపడ్డారు. ఐపీఎల్‌ను సరైన సమయంలో నిర్వహించకపోవడమే దానికి కారణమని భావిస్తున్నా. సుదీర్ఘ పర్యటనకు ముందు లీగ్ నిర్వహించాల్సింది కాదు. అయితే ఐపీఎల్ అంటే నాకు ఎంతో ఇష్టం. కౌంటీ క్రికెట్ మాదిరిగానే యువ క్రికెటర్లను ఐపీఎల్ ప్రోత్సహిస్తుంది. కానీ, నిర్వహించిన సమయమే సరైనది కాదు. ఇరు జట్లపై గాయాలు ప్రభావం చూపుతున్నాయి. దీనిపై ఆలోచిస్తారని ఆశిస్తున్నా" అని లాంగర్ అన్నాడు. ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్‌కు కూడా పర్యటనలోని తొలి వన్డేలో గాయపడ్డాడు.
"వారిద్దరు(బుమ్రా, జడేజా) లేకపోవడం మాకు సానుకూలాంశమే. అయితే కీలక ఆటగాళ్లు దూరమైతే ఏ జట్టుపై అయినా తప్పక ప్రభావం ఉంటుంది. ప్రత్యర్థి జట్టు కూర్పు గురించి కాకుండా మ్యాచ్‌లో ఎలా ప్రదర్శించాలనే దానిపై మేం దృష్టిసారిస్తాం" అని చివరి టెస్టు గురించి లాంగర్ చెప్పాడు.
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు గాయపడిన భారత ఆటగాళ్లలో షమి, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, అశ్విన్, పంత్, బుమ్రా ఉన్నారు. ఐపీఎల్‌లో ఇషాంత్ శర్మ, భువనేశ్వర్, రోహిత్ శర్మ, వరుణ్ చక్రవర్తి గాయపడ్డారు.