ఇంగ్లాండ్ సారథి జోరూట్ జోరు మీదున్నాడు. వరుసగా 98, 99, 100 టెస్టుల్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు తొలిసెషన్‌లో అతడు 150 పరుగుల మైలురాయి అందుకున్నాడు. దాంతో ఆస్ట్రేలియా మాజీ సారథి డాన్ బ్రాడ్‌మన్ సరసన చేరాడు. బ్రాడ్‌మన్ తర్వాత వరుసగా మూడు టెస్టుల్లో 150కి పైగా పరుగులు చేసిన ఏకైక కెప్టెన్‌గా ఇంగ్లాండ్ సారథి రికార్డు నెలకొల్పాడు.
శుక్రవారం రూట్ 184 పరుగులతో కొనసాగుతున్నాడు. దాంతో వందో టెస్టులో శతకం బాదిన తొమ్మిదో ఆటగాడిగా అతడు మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు కొలిన్ కౌడ్రె, జావెద్ మియాందాద్, గార్డన్ గ్రీనిడ్జ్, అలెక్ స్టీవార్ట్, ఇంజమామ్, రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్, హషిమ్ ఆమ్లా మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి రోజు 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన రూట్.. డొమినిక్ సిబ్లీ(87; 286 బంతుల్లో 12x4)తో కలిసి మూడో వికెట్‌కు 200 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే చివరి ఓవర్‌లో సిబ్లీ ఔటయ్యాక ఆట నిలిచిపోయింది.

ఇక 263/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం బెన్‌స్టోక్స్‌తో కలిసి రూట్ బ్యాటింగ్ ఆరంభించగా.. షాబాజ్ నదీమ్ వేసిన 111వ ఓవర్‌లో సింగిల్ తీసి 150 పరుగులు పూర్తి చేశాడు. అయితే వరుస టెస్టుల్లో అత్యధికసార్లు 150కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో శ్రీలంక మాజీ కీపర్ కుమార సంగక్కర(2007) అందరికన్నా ముందున్నాడు. అతడు నాలుగు టెస్టుల్లో ఆ ఘనత సాధించాడు. తర్వాత వాలీ హేమండ్ (1928-29), డాన్ బ్రాడ్‌మన్ (1937), జహీర్ అబ్బాస్(1982-83), ముదస్సార్ నజర్(1983), టామ్ లాథమ్(2018-19), జోరూట్(2021) వరుసగా మూడు టెస్టుల్లో అదే ఘనత సాధించాడు. కాగా, రూట్ మాత్రమే 98, 99, 100వ టెస్టుల్లో ఈ ఘనత సాధించడం విశేషం.
ఇదీ చదవండి:మ్యాచ్ గమనాన్నే మార్చేసిన భారత క్రికెటర్లు!