టీ20 క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ప్రవేశపెట్టి... కొత్త పంథాను ప్రారంభించింది బీసీసీఐ. ఈ లీగ్ రాకతో భారత క్రికెట్లో ఎన్నో మార్పులొచ్చాయి. టీమిండియాలో యువ ఆటగాళ్ల ఎంపికకు ఐపీఎల్ ప్రదర్శననూ చూస్తున్నారు సెలక్టర్లు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నీగా ఇది పేరు తెచ్చుకొని కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా వచ్చే ఏడాది మరిన్ని మార్పులతో రసవత్తరంగా మారనుందీ ఐపీఎల్. ఈ మేరకు బీసీసీఐ యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది.
పవర్ ప్లేయర్...
ఈ టీ20 లీగ్‌లో కొత్తగా 'పవర్ ప్లేయర్' రానున్నాడు. ఓవర్ పూర్తయిన తర్వాతైనా, వికెట్ పడినప్పుడైనా తుదిజట్టులో లేని ఆటగాడిని సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దింపవచ్చు. ఎవరికైనా గాయమైనా, జట్టుకు అవసరమైన సమయంలో పవర్ ప్లేయర్‌ను తీసుకురావచ్చు. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌లో మరిన్ని మార్పులను చేయాలని చూస్తున్నారు లీగ్ నిర్వాహకులు.
" పవర్ ప్లేయర్ పద్దతిని ఇప్పటికే అంతర్గతంగా అందరూ బాగుందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సభ్యులంతా ఈ విషయంపై మంగళవారం చర్చించనున్నారు."
--బీసీసీఐ వర్గాలు
ఈ నిర్ణయాలతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా, ఫలితాలు ఆసక్తికరంగా మారతాయని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయట.
ఉదాహరణ..
చివరి 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు జట్టులో ఆండ్రీ రసెల్ ఉన్నాడు. కానీ అతడికి 11 మంది జట్టు సభ్యుల్లో స్థానం దక్కలేదు. ఈ నూతన నిర్ణయంతో రసెల్నూ తీసుకోవచ్చు. అలాంటి సమయాల్లో ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధానంతో 15 మందీ తుది జట్టులో ఉన్నట్లే.
ఇదే విధంగా 6 పరుగులను కాపాడుకోవాల్సిన పరిస్థితే వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా 11 మందిలో లేకున్నా... అతడి బౌలింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల ఫలితం ఆసక్తికరంగా ఉంటుందని ఆశిస్తున్నారు బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు. ఈ ఏడాది ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణ, పలు అంశాలపై నవంబర్ 5న(మంగళవారం) ఈ భేటీలో చర్చించనున్నారు. నూతనంగా ఏదైనా మార్పులు చేపట్టాలంటే ఐపీఎల్ జనరల్ కౌన్సిల్ అంతా దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత లీగ్‌ను ఎలా నిర్వహించాలి..? ఎలాంటి విషయాల్లో మార్పులు చేయాలి, అభిమానులకు మరింత ఆసక్తి కలిగించేలా విభిన్న నిర్ణయాలు తీసుకోనున్నారు బృంద సభ్యులు.