టెస్టు స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు టీమ్ఇండియా క్రికెటర్ చతేశ్వర్ పుజారా. పరిమిత ఓవర్ల జట్టులోనూ స్థానం పొందడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రతిసారీ అతడికి మొండిచేయి చూపిస్తున్నారు సెలక్టర్లు. ఐపీఎల్లోనూ అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్రతి ఏడాది ఈ మెగా లీగ్ సమయంలో పుజారా ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడేవాడు. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా అది కూడా వీలు లేకుండా పోయింది. దీంతో టీమ్ఇండియా ఆటగాళ్లందరూ ఐపీఎల్ కోసం బిజీగా గడుపుతుంటే పుజారా ఇంటివద్దే ఉండిపోయాడు. తాజాగా దీనిపై స్పందించాడు నయా వాల్.
"హషీమ్ ఆమ్లా లాంటి క్లాస్ ఆటగాళ్లూ వేలంలో అమ్ముడు పోకపోవడం నేను చూశా. చాలా మంది గొప్ప టీ20 ఆటగాళ్లకు అవకాశాలు రాలేదు. నన్ను తీసుకోనందుకు నాకేమీ అసూయ లేదు. ఐపీఎల్ వేలం కొంత గమ్మత్తుగా అనిపిస్తుంది. ఒకవేళ అవకాశం వస్తే లీగ్లో ఆడటానికి ఇష్టపడతా. పరిమిత ఓవర్ల జట్టులో చోటు లభిస్తే కచ్చితంగా నిరూపించుకుంటా. ఒకసారి అవకాశం ఇస్తేనే కదా తెలిసేది. లిస్ట్-ఏ క్రికెట్లో మంచి ప్రదర్శన (54సగటుతో) చేశా. అలాగే దేశవాళీ టీ20 టోర్నీలోనూ (సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో సెంచరీ) రాణించా. అన్ని ఫార్మాట్లలో ఆడితేనే నాకు సంతోషం."
-పుజారా, టీమ్ఇండియా క్రికెటర్
ప్రతి ఏడాది ఐపీఎల్ సమయంలో పుజారా ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడేవాడు. కానీ ఈసారి కరోనా కారణంగా అదీ వీలు కాలేదు. దీనిపైనా స్పందించాడు పుజారా. ఆ విషయంలో కాస్త బాధగానే ఉన్నట్లు తెలిపాడు. ఈ కఠిన పరిస్థితుల్ని అర్థం చేసుకోగలనని అన్నాడు. ప్రస్తుతం కుటుంబంతో గడుపుతూ సురక్షితంగా ఉండటమే శ్రేయస్కారమని వెల్లడించాడు. ఎక్కువగా ప్రాక్టీస్ లభించట్లేదని బాధ పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.