క్రికెట్ టోర్నీలు లేకుండా ఐదు నెలలు గడిచిపోయింది. దీంతో ఐపీఎల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ల బ్యాటింగ్ విన్యాసాల కోసం పరితపిస్తున్నారు. అయితే కొందరు ఆటగాళ్లు చాలా ఏళ్లుగా ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్నారు. టోర్నీలోనూ కీలకంగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన అనుభవజ్ఞులైన ఆటగాళ్ల గురించి తెలుసుకుందామా.
1)మహేంద్రసింగ్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్)
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఐపీఎల్లో ఇప్పటివరకు 190 మ్యాచ్‌లు ఆడాడు. ధోనీ కంటే మూడు మ్యాచ్‌లు ఎక్కువ ఆడి అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా సురేశ్ రైనా ఘనత సాధించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు రైనా ఇటీవలే తెలిపాడు. దీంతో ఐపీఎల్లో సీఎస్కే తరఫున ప్రస్తుతం అత్యధిక మ్యాచ్‌లు ఆడిన అనుభవం ధోనీకి మాత్రమే ఉంది.
![IPL 2020: Players with the most IPL appearances](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8625096_hsa.jpg)
2008లో ఐపీఎల్ ప్రారంభంలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఎంపికైన ధోనీ.. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో సీఎస్కేపై రెండేళ్ల నిషేధం కారణంగా 2016, 2017 ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మహీ తన ఐపీఎల్ కెరీర్లో 137.85 స్ట్రైక్‌రేట్‌తో 4,432 పరుగులు చేశాడు. అందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
2)రోహిత్ శర్మ (ముంబయి ఇండియన్స్)
ఐపీఎల్లో ఇప్పటివరకు అద్భుతమైన రికార్డు కలిగిన ఆటగాళ్లలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 188 మ్యాచ్‌ల్లో 130.82 స్ట్రైక్‌రేట్‌తో 4,898 పరుగులను నమోదు చేయగా అందులో ఒక శతకంతో పాటు 36 అర్ధ శతకాలున్నాయి. ఈ టోర్నీలో అత్యధికంగా 109 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు రోహిత్.
![IPL 2020: Players with the most IPL appearances](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8625096_hk.jpg)
ఐపీఎల్ ప్రారంభం నుంచి 2010 వరకు వరుసగా మూడేళ్ల పాటు హైదరాబాద్ జట్టులో ఉన్నాడు రోహిత్‌శర్మ. 2011లో జరిగిన ఐపీఎల్ వేలంలో ముంబయి ఇండియన్స్ జట్టు రోహిత్‌ను సొంతం చేసుకుని 2013లో కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. దక్కన్ ఛార్జర్స్ తరపున ఒకసారి.. ముంబయి ఇండియన్స్ తరపున నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు హిట్‌మ్యాన్.
3) దినేశ్ కార్తిక్ (కోల్‌కతా నైట్‌రైడర్స్)
కోల్‌కతా సాధించిన ఎన్నో కీలకమైన విజయాల్లో భాగమయ్యాడు వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్. ఐపీఎల్లో ఇప్పటివరకు 182 మ్యాచ్‌ల్లో ఆడి.. 3,654 పరుగులను నమోదు చేయగా అందులో 18 అర్ధ శతకాలున్నాయి. ఈ టోర్నీలో అత్యధికంగా 97 పరుగులు చేశాడు కార్తిక్.
![IPL 2020: Players with the most IPL appearances](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8625096_1.jpg)
2018లో ఇతడిని కెప్టెన్‌గా నియమించింది కేకేఆర్. జట్టును నడిపించడంలో దినేశ్ కార్తిక్ విజయం సాధించాడనే చెప్పాలి. ప్రస్తుత సీజన్లో ఇతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ భావిస్తోంది.
4)రాబిన్ ఉతప్ప (రాజస్థాన్ రాయల్స్)
ఆరేళ్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడిన రాబిన్ ఉతప్ప.. ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడనున్నాడు. కేకేఆర్ తరపున అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన ఇతడి అనుభవం ఇప్పుడు తమకు పనికొస్తుందని రాజస్థాన్ భావిస్తోంది. ఐపీఎల్లో ఇప్పటివరకు 177 మ్యాచ్‌ల్లో 130.50 స్ట్రైక్‌రేట్‌తో 4,411 పరుగులు నమోదు చేశాడు. అందులో 24 అర్ధ శతకాలున్నాయి.
![IPL 2020: Players with the most IPL appearances](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8625096_hsd.jpg)
5) విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
ఐపీఎల్లో ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. 2008లో అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును విజేతగా నిలబెట్టడం వల్ల వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రారంభ ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఇతడిని దక్కించుకుంది.
![IPL 2020: Players with the most IPL appearances](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8625096_7.jpg)
ఐపీఎల్లో ఇప్పటివరకు 177 మ్యాచ్‌లు ఆడి 131.61 స్ట్రైక్‌రేట్‌తో 5,412 పరుగులు నమోదు చేయగా.. అందులో 5 శతకాలు, 36 అర్ధ శతకాలున్నాయి. ఈ టోర్నీలో కోహ్లీ అత్యధికంగా 113 రన్స్ చేశాడు.
6) శిఖర్ ధావన్ (దిల్లీ క్యాపిటల్స్)
యువ క్రికెటర్లతో పాటు అనుభజ్ఞులైన ఆటగాళ్లతో ప్రస్తుత ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ బలంగా మారింది. ఈ ఫ్రాంచైజీలో ముఖ్యమైన ఆటగాళ్లలో టీమ్ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ముందుంటాడు.
![IPL 2020: Players with the most IPL appearances](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8625096_3.jpg)
ఐపీఎల్లో ఇప్పటివరకు 159 మ్యాచ్‌లు ఆడాడు గబ్బర్. ఈ టోర్నీలో 4,579 పరుగులను నమోదు చేయగా అందులో 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో ధావన్ అత్యధిక స్కోరు 97గా ఉంది.
7) మనీష్ పాండే (సన్‌రైజర్స్ హైదరాబాద్)
ఐపీఎల్ 2009లో సెంచరీ చేసి.. లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా మనీష్ పాండే గుర్తింపు పొందాడు. టోర్నీ ప్రారంభంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన మనీష్.. అప్పటి నుంచి మూడు వేర్వేరు జట్లకు ఆడి ఐపీఎల్ కెరీర్లో 130 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలతో 2,843 పరుగులను నమోదు చేశాడు. అత్యధికం 114 రన్స్.
![IPL 2020: Players with the most IPL appearances](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8625096_ha.jpg)
ప్రస్తుతం మనీష్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్నాడు. 2014 నుంచి 2017 వరకు కోల్‌కతా జట్టులో విజయవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
8) క్రిస్‌గేల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)
ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక విదేశీ ఆటగాడు క్రిస్ గేల్. గేల్ కొన్నేళ్లుగా ఐపీఎల్లో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్నాడు. టోర్నీలో 125 మ్యాచ్‌ల్లో 151.02 స్ట్రైక్ రేట్‌తో 4,484 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో గేల్ అత్యధికంగా 175 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
![IPL 2020: Players with the most IPL appearances](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8625096_6.jpg)
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభించినప్పటికీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏడేళ్ల కాలంలో ఎన్నో విజయాలలో భాగమయ్యాడు గేల్. ఐపీఎల్ 2018 నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడీ విధ్వంసకర బ్యాట్స్‌మన్.