భారత స్టార్ క్రికెటర్ మహ్మద్ షమి తన సహృదయాన్ని చాటుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలకు.. ఆహారం, మాస్కులు పంపిణీ చేశాడు. ఉత్తరప్రదేశ్ షహాస్పుర్లోని తన స్వగృహం వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది బీసీసీఐ. ఇలాంటి విపత్కర సమయంలో "అందరం తోడుగా ఉన్నాం" అని భరోసానిచ్చింది.
ఇటీవలె మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఇంట్లో తయారు చేసిన భోజనాన్ని వలసకూలీలకు అందజేశాడు. ఇప్పటికే బీసీసీఐ సహా పలువురు క్రికెటర్లు కలిసి పీఎం కేర్స్‌కు భారీ విరాళం అందజేశారు.
దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలకు చేరువవగా.. మహమ్మారి కారణంగా 5వేల 500 మందికి పైగా బలయ్యారు.