దేశ క్రీడారంగంపై కరోనా వైరస్ (కొవిడ్-19) పెను ప్రభావం చూపిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మిగతా రెండు వన్డేలు ఖాళీ స్టేడియాల్లో జరిగే అవకాశం ఉంది. మార్చి 15న లఖ్‌నవూ, 18న కోల్‌కతాలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. కరోనా వైరస్‌ను మహమ్మారి అంటువ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించడం వల్ల ఈ మ్యాచ్లకు అభిమానులను అనుమతించరని సమాచారం.
రద్దు లేదా వాయిదా వేయలేని క్రీడా పోటీలను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలకు.. ఇప్పటికే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా ఒక్క చోటకు చేరకుండా అడ్డుకోవాలని తెలిపింది.
" బీసీసీఐకీ క్రీడామంత్రిత్వ శాఖ ఆదేశాలు అందాయి. భారీ సంఖ్యలో జనాలు ఒక్కచోటకు చేరకుండా చూడాలని ప్రభుత్వం కోరింది. మేం ఆ నియమాల్ని పాటించాల్సిందే" అని బీసీసీఐలోని ఓ అధికారి వెల్లడించారు.
సౌరాష్ట్ర, బెంగాల్ తలపడుతున్న రంజీట్రోఫీ ఫైనల్ చివరి రోజు మైదానంలోకి అభిమానులను అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. కేవలం ఆటగాళ్లు, అధికారులు, మీడియా ప్రతినిధులను మాత్రమే ఎంట్రీ ఉండనుంది. ఐపీఎల్ 2020 ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.