ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 910 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న భారత సారథికి... 904 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉన్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ గట్టి పోటీనిస్తున్నాడు. వీరిద్దరి మధ్య 6 పాయింట్ల అంతరం మాత్రమే ఉంది.
బ్యాటింగ్ విభాగంలో కివీస్ ఆటగాడు కేన్ విలియమ్సన్, భారత క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా 3, 4 స్థానాల్లో నిలిచారు. టెస్టుల్లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే 11వ స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల విండీస్‌తో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 81, 102 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో 10 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు.
బుమ్రా బెస్ట్...
టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో టాప్ బౌలర్‌గా ఉన్న బుమ్రా... టెస్టు ర్యాంకింగ్స్‌లో 7వ స్థానం కైవసం చేసుకున్నాడు.
ప్రస్తుతం విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది భారత జట్టు. ఇటీవల జరిగిన తొలి టెస్టులో 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు బుమ్రా. ఫలితంగా 9 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. టెస్టుల్లో వేగంగా 50 వికెట్లు తీసిన భారత పేసర్‌గా రికార్డు సృష్టించాడు. బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) ఉన్నాడు. మరో టీమిండియా ప్లేయర్ జడేజా 10వ స్థానంలో నిలిచాడు.
ఆల్‌రౌండర్ విభాగంలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్‌స్టోక్స్ 2వ ర్యాంక్ సాధించాడు. విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ టాప్‌లో కొనసాగుతున్నాడు. యాషెస్‌లో సత్తా చాటుతోన్న స్టోక్స్... మూడో టెస్టులో అద్భుత ప్రదర్శన చేశాడు. ఫలితంగా బ్యాట్స్‌మెన్ విభాగంలోనూ 13వ స్థానంలో నిలిచాడు.
ఇదీ చదవండి...'ఫిరోజ్ షా కోట్లా' పేరు మారిందిలా...!