అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా ఉన్న మను సాహ్నీ.. పదవీకాలం ముగిసే లోపే అతనితో రాజీనామా చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్ చేసిన అంతర్గత దర్యాప్తులో మను సాహ్నీ.. ఐసీసీ సభ్య దేశాలతో సహా సహోద్యోగులతో సరిగా ప్రవర్తించడం లేదని తేలింది. దీంతో అతడిని సెలవుపై పంపించారు.
2019లో ఐసీసీ ప్రపంచకప్ తర్వాత సీఈఓ బాధ్యతలు స్వీకరించిన మను సాహ్నీ పదవీకాలం 2022లో ముగియనుంది. 2019లో డేవ్ రిచర్డ్సన్ నుంచి బాధ్యలు స్వీకరించిన మను సాహ్నీపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఐసీసీలోని ముఖ్య క్రికెట్ బోర్డులపై వ్యతిరేకత చూపిస్తున్న తీరుపై బీసీసీఐ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు గుర్రుగా ఉన్నాయి. అలాగే, గతేడాది ఐసీసీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తాత్కాలిక ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజాకు మద్దతు ఇచ్చినందుకు కొన్ని క్రికెట్ బోర్డులు మను సాహ్నీపై అసంతృప్తిగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మను సాహ్నీని సెలవుపై ఐసీసీ పంపించింది.
"చాలా క్రికెట్ బోర్డులకు సాహ్నీపై ఇష్టం లేదు. కొత్త ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యంపై అసంతృప్తి చెందాయి" అని బీసీసీఐలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఐసీసీ నిర్వహణ, బిడ్లు దాఖలు చేసేందుకు రుసుము చెల్లించాలన్న నిర్ణయానికి ఆయన మద్దతు తెలపడమూ పెద్ద బోర్డులకు నచ్చలేదు. బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు సమావేశాల్లో దీనిని తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం.
2023-2031 మధ్య ఏటా ఐసీసీ టోర్నీ ఒకటి నిర్వహించాలన్న ఆయన నిర్ణయమూ వ్యతిరేకతకు కారణమైంది. సాహ్నీ రాజీనామా చేయకపోతే తొలగింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. బోర్డుకు ఉన్న 17 మంది డైరెక్టర్లలో 12 మంది ఇందుకు మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: 'రెండు జట్లను మైదానంలోకి దించే సత్తా భారత్ సొంతం'