ఈసారి ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందున్న లక్ష్యం ఎలాగైనా కప్పు గెలవడమేనని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి స్టార్ స్పోర్ట్స్ నిర్వహించే క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో ఇతడు పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా వారిద్దరికి ఆర్సీబీ సారథిపై ఒకే ప్రశ్న వేశారు. ఈ సీజన్‌లో ఆ జట్టు కెప్టెన్‌గా అతడి ముందున్న ప్రధాన లక్ష్యం ఏంటని అడిగారు. తొలుత స్పందించిన బంగర్.. ఈ సీజన్‌లో ఆ జట్టు బలంగా కనిపిస్తుందని చెప్పాడు. గతంలో కేవలం బ్యాటింగ్ లైనప్ మీదే ఆధారపడిన ఆ జట్టు ఈసారి బౌలింగ్‌పైనా దృష్టిసారించిందని తెలిపాడు.
"కోహ్లీ ఈసారి సరైన జట్టును తీసుకున్నట్లు అనిపిస్తోంది. గతంలో ఆ జట్టు కేవలం బ్యాటింగ్‌పైనే ఆధారపడేది. బౌలింగ్‌పై అంత శ్రద్ధ వహించేది కాదు. అయితే, ఆ యాజమాన్యం ఈసారి బౌలింగ్ లైనప్‌నూ బలోపేతం చేసింది. పలువురు ఆల్‌రౌండర్లను కూడా తీసుకుంది. దానికి తోడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ కొత్తగా జట్టులో చేరాడు. దీంతో ఆర్సీబీ చాలా సమతుల్యంగా కనిపిస్తోంది."
- సంజయ్ బంగర్, టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్
రోహిత్ నాలుగు సార్లు, ధోనీ మూడు సార్లు టైటిల్ సాధించినా కోహ్లీ మాత్రం అది గెలవలేకపోయాడని గంభీర్ గుర్తుచేశాడు. "అతడెంతో కాలం నుంచి ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేస్తున్నాడు. ఇప్పుడూ అలాంటి ప్రదర్శనే చేస్తుండొచ్చు. అయితే, అంతిమంగా జట్టును విజేతగా నిలబెట్టడమే అతడి ముందున్న కర్తవ్యం. ఈ విషయంలో ఎవర్ని అడిగినా ఇదే చెబుతారు. టోర్నీలో అత్యధిక పరుగులు చేయాలని ఉంటుందా లేక కప్పు గెలవాలని ఉంటుందా అంటే.. కచ్చితంగా బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన చేశాక కప్పే గెలవాలని కోరుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే అతడు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగుతాడు కాబట్టి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌తో పోలిస్తే కచ్చితంగా ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంటుంది. దీంతో అతడిప్పుడు చేయాల్సిందల్లా ఆ జట్టును విజేతగా నిలబెట్టడమే లేదా ప్లేఆఫ్స్‌కైనా తీసుకెళ్లడం" అని గంభీర్ వివరించాడు.