బంగ్లా సీనియర్ క్రికెటర్, మాజీ సారథి మష్రఫె మొర్తజా కరోనాను జయించాడు. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టు చేశాడు. ఇంట్లోనే కరోనా చికిత్స పూర్తయిందని ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు తెలిపాడు. జూన్ 20న ఇతడికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. తాజా టెస్టుల్లో నెగిటివ్ వచ్చినట్లు మొర్తజా స్పష్టం చేశాడు.
"అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. దేవుడి దయవల్ల, మీ అందరి ప్రార్థనల వల్ల నేను కరోనా నుంచి కోలుకున్నాను. తాజాగా చేసిన టెస్టులో ఫలితం నెగిటివ్ వచ్చింది. కష్టసమయంలో నాకు మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంట్లోనే కరోనాకు ట్రీట్మెంట్ చేయించుకున్నా. బాధితులు పాజిటివ్‌గా ఉండండి. దేవుడి కృప మీపై ఉంటుంది. మనందరం కరోనాపై పోరాడుదాం"
-- మష్రఫె మొర్తజా
తన భార్య సుమోనా మాత్రం కోలుకోడానికి కొద్దిగ సమయం పడుతుందని వెల్లడించాడు 36 ఏళ్ల పేసర్ మొర్తజా. ప్రస్తుతం ఈ స్టార్ క్రికెటర్ పార్లమెంట్ సభ్యుడిగా అవామీ లీగ్ పార్టీ తరఫున ఉన్నాడు. ఇతడితో పాటు బంగ్లా జట్టు స్పిన్నర్ నజ్మల్ ఇస్లామ్, ఆ జట్టు వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సోదరుడు, మాజీ క్రికెటర్ నఫీజ్ ఇక్బాల్‌కు కూడా వైరస్ సోకింది. వీరిద్దరూ ప్రస్తుతం కోలుకొని హోమ్ క్వారంటైన్లో ఉన్నారు.