క్రికెట్ మ్యాచ్ అన్నాక స్టాండ్స్‌లో అభిమానులుంటేనే మజా. అందులోనూ ఫ్యాన్స్ సందడి తారా స్థాయిలో ఉండే ఐపీఎల్ మ్యాచ్‌లను బోసిపోయిన స్టేడియాల్లో నిర్వహించడం అన్న ఊహే ఏదోలా ఉంటుంది. కరోనా నేపథ్యంలో సెప్టెంబరు 19న యూఏఈలో ఆరంభమయ్యే ఐపీఎల్‌కు ప్రేక్షకులను అనుమతించరనే అనుకుంటున్నారు. ఈ విషయంలో బీసీసీఐ ఆలోచన ఎలా ఉందో కానీ.. ఆతిథ్య ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మాత్రం ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే అవకాశం తమ క్రికెట్ అభిమానులకు ఇవ్వాలనే చూస్తోంది.
"తమ దేశంలో కరోనా అదుపులోనే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అనుమతిస్తే స్టేడియాల్లో 30 నుంచి 50 శాతం దాకా సీట్లను అభిమానులతో నింపాలనే అనుకుంటోంది. "ముందు మా దగ్గర ఐపీఎల్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం అనుమతించాలి. బీసీసీఐ ఆ విషయాన్ని ధ్రువీకరించాలి. తర్వాత లీగ్‌ను నిర్వహించేందుకు తయారు చేసిన విధి విధానాలను మా ప్రభుత్వం ముందుంచుతాం. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని ప్రత్యక్షంగా ఆస్వాదించే అవకాశాన్ని మా ప్రజలకు ఇవ్వాలనే భావిస్తున్నాం. కానీ అది ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది"
-ముబాషిర్ ఉస్మాని, ఎమిరేట్స్ బోర్డు కార్యదర్శి
ప్రేక్షకులను అనుమతిస్తే కరోనా వ్యాప్తి చెంది, ఆటగాళ్లు ప్రమాదంలో పడేందుకు ఆస్కారమున్న నేపథ్యంలో బీసీసీఐ ఇందుకు అంగీకరిస్తుందో లేదో చూడాలి.