యువ ఆటగాళ్లను అత్యుత్తమ క్రికెటర్లను తయారు చేసే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్.. తన బ్యాటింగ్ మెరుగుపడటంలోనూ సహాయపడ్డాడని చెప్పాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్. ముఖ్యంగా స్పిన్ ఎదుర్కోవడంలో అతడు చెప్పిన పాఠాలు బాగా పనికొచ్చాయని తెలిపాడు. ఐపీఎల్లో వల్ల తన ఆటతీరు మెరుగైందని.. ద్రవిడ్, సెహ్వాగ్ లాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లతో ఆడటం గొప్ప అనుభూతి అని అన్నాడు.
"స్పిన్ ఎదుర్కోవడం గురించి ద్రవిడ్ పాఠాలు చెప్పారు. బంతి డెలివరీ అయ్యాక లెంగ్త్ చూసుకొని ఆడాలని పలు సూచనలు ఇచ్చారు. అవి నా ఆటతీరును పూర్తిగా మార్చేశాయి" అని పీటర్సన్ తెలిపాడు.
ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్, దిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు పీటర్సన్. పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ప్రపంచంలోని విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. 104 టెస్టుల్లో 8181 పరుగులు, 134 వన్డేల్లో 4440 పరుగులు చేశాడు.
కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఐపీఎల్.. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 మధ్య యూఏఈ వేదికగా జరగనుంది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా చాలా రోజుల తర్వాత మెగాటోర్నీని విదేశాల్లో నిర్వహిస్తున్నారు.