మూడు టెస్టుల సిరీస్ కోసం భారత్ 1986లో ఇంగ్లాండ్‌లో పర్యటించింది. లార్డ్స్‌లో తొలి మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 294 పరుగులు చేసింది. గ్రాహమ్ గూచ్ (114) సెంచరీతో సత్తా చాటాడు. చేతన్ శర్మ (5/64) విజృంభించి ప్రత్యర్థికి అడ్డుకట్ట వేశాడు. పిచ్ చూస్తే బ్యాటింగ్‌కు కష్టంగా ఉంది. డెరెక్ ప్రింగిల్, గ్రాహం డిలీ లాంటి ప్రత్యర్థి పేసర్లకు ఎదురొడ్డి భారత్ బ్యాట్స్‌మెన్ ఏ మేరకు నిలుస్తారోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ లార్డ్స్‌లో మ్యాచ్ అంటే పరుగుల పండగ చేసుకునే దిలీప్ ఎప్పటిలాగే చెలరేగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను అజేయంగా నిలిచి 213 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో 126 పరుగులు చేశాడు. మొదట అమర్‌నాథ్ (69)తో కలిసి మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించిన అతను.. అనంతరం మహ్మద్ అజహరుద్దీన్ (33) జతగా నాలుగో వికెట్‌కు మరో 71 పరుగులు జతచేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు క్రీజులో పట్టుదలగా నిలబడి జట్టుకు ఆధిక్యం అందించాడు. అతని సెంచరీ సాయంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 341 పరుగులు చేసి 47 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో కపిల్ దేవ్ (4/52) ధాటికి ఇంగ్లాండ్ 180 పరుగులకే కుప్పకూలింది. 134 పరుగుల లక్ష్యాన్ని భారత్ అయిదు వికెట్లు కోల్పోయి అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో దిలీప్ 33 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. రెండో మ్యాచ్‌లోనూ మరో శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించిన అతను.. భారత్ టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ప్రస్తుత క్రికెట్లోనూ ఇంగ్లాండ్‌లో టెస్టు విజయం సాధించడం కష్టమే. అలాంటిది 1980ల్లో.. అది కూడా లార్డ్స్‌లో ఆతిథ్య జట్టుపై గెలవడం అంటే దాదాపు అసాధ్యమే. అప్పటికే ఆ స్టేడియంలో ఆడిన తొలి ఆరు టెస్టుల్లో భారత్ పరాజయం పాలైంది. మొత్తంగా పది మ్యాచ్‌ల్లో ఎనిమిదింట్లో ఓడి, రెండు డ్రాలతో సరిపెట్టుకుంది. ఆ నేపథ్యంలో మరోసారి లార్డ్స్ టెస్టుకు సిద్ధమైంది. బ్యాటింగ్ చేయడానికి కఠిన పరిస్థితులు నెలకొన్న ఆ పిచ్‌పై భారత్ విజయం సాధిస్తుందని ఎవరికీ నమ్మకల్లేవు. కానీ కపిల్ డెవిల్స్ ఆ అసాధ్యాన్ని అందుకుంది. దిలీప్ అద్భుత బ్యాటింగ్ సాయంతో.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటికే లార్డ్స్‌లో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో శతకాలు సాధించిన అతను జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. దీంతో ఈసారి ఎలాగైనా గెలుపు తలుపు తట్టాలనే పట్టుదల ప్రదర్శించాడు.
బౌన్సీ పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లను జాగ్రత్తగా కాచుకుంటూ పరుగుల వేటను మొదలెట్టాడు. తన అమ్ముల పొదిలోని కవర్ డ్రైవ్స్, స్క్వేర్ డ్రైవ్స్, కట్ షాట్ల్లు.. ఇలా అన్ని అస్త్రాలను వాడుతూ బౌండరీలు రాబట్టాడు. పేసర్లు బౌన్సర్లతో పరీక్షిస్తే హుక్ షాట్లతో వాటిని బౌండరీలుగా మార్చాడు. వెంగీ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నప్పటికీ.. మరోవైపు సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. అయినప్పటికీ ఎక్కడా తొందరపాటు, అలసత్వం ప్రదర్శించకుండా.. బౌలర్లకు ఒక్క చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా అతను ఇన్నింగ్స్ కొనసాగించాడు. మిడ్‌వికెట్ మీదుగా ఫోర్ కొట్టి 99కు చేరుకున్న అతను వేగంగా సింగిల్ తీసి శతకం పూర్తిచేసి అరుదైన ఘనతను అందుకున్నాడు. లార్డ్స్‌లో వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో (1979, 1982, 1986) మూడు శతకాలు చేసిన తొలి ఆటగాడు అతనే. ఈ ఊపులో తర్వాత ఆడిన 16 టెస్టుల్లో వెంగీ 101.93 సగటుతో 1631 పరుగులు చేశాడు. అందులో ఎనిమిది శతకాలున్నాయి.