తమిళనాడు యువ క్రికెటర్ షారుక్ ఖాన్ కనీస ధర రూ.20లక్షలు.. అయితే పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ.5.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీనిపై స్పందించిన షారూఖ్.. వేలంలో తన పేరు వచ్చినప్పుడు ఏమాత్రం ఆత్రుత పడలేదని తెలిపాడు. జట్టు సభ్యులతో కలిసి ప్రశాంతంగా వేలం చూశానని తమిళనాడు యువ క్రికెటర్ షారుక్ ఖాన్ వివరించాడు. చిన్నప్పటి నుంచి సినిమాలు విపరీతంగా చూసేవాడినని, సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే అభిమానమని పేర్కొన్నాడు.
"వేలంలో నా పేరు వచ్చినప్పుడు ఆందోళన పడలేదు. చాలా ఆనందం వేసింది. బస్సులోని నా సహచరులు, ముఖ్యంగా దినేశ్ కార్తీక్ ఎంతో సంతోషించాడు. సుదీర్ఘకాలం వేచిచూశాక ఐపీఎల్ ఆడుతుండటంతో చాలా ఆనందమేసింది."
-షారుఖ్ ఖాన్.
టెన్నిస్ బంతితో మొదలు..
తమిళనాడు జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న షారూఖ్.. చిన్నప్పుడు టెన్నిస్ బంతి క్రికెట్ ఆడానని తెలిపాడు. పాఠశాల స్థాయిలో బాగా రాణించాడు షారూఖ్. క్రికెట్ సంస్కృతి ఎక్కువగా కనిపించే డాన్‌బోస్కో, సెయింట్ బెడెస్ పాఠశాలల్లో చదువుకున్నాడీ ఈ యువ ఆటగాడు. అశ్విన్, దినేశ్ కార్తీక్, కె.శ్రీకాంత్ సైతం అక్కడి నుంచి వచ్చినవారే.
'ఐపీఎల్ గురించి అతిగా ఆలోచించి నాపై ఒత్తిడి పెంచుకోవడం లేదు. దానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఇప్పుడు విజయ్ హజారేలో రాణించడంపై దృష్టి నిలిపాను. పంజాబ్ కింగ్స్ కోచ్ అనిల్ కుంబ్లే వద్ద నేర్చుకొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. పైగా తమిళనాడు స్పిన్నర్ మురుగన్ అశ్విన్ సైతం అందులోనే ఉన్నాడు' అని షారుక్ తెలిపాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం: ఫ్రాంఛైజీల ఉత్తమ, అనూహ్య నిర్ణయాలు ఇవే!