ఐసీసీ ప్రపంచకప్ 2019 టోర్నీ క్రికెట్ అభిమానులైన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. తుదిపోరులో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అవ్వగా.. ఆ తర్వాత నిర్వహించిన సూపర్ ఓవర్ స్కోర్లూ సమం కావడం వల్ల నిర్వాహకులే ఆశ్చర్యానికి గురయ్యారు. చివరికి బౌండరీ కౌంట్ ద్వారా ఆ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఆతిథ్య జట్టునే విజేతగా ప్రకటించారు.
అయితే ఈ మెగా ఈవెంట్లో కొంతమంది మహిళా వాఖ్యాతలూ పాలుపంచుకున్నారు. ప్రతి మ్యాచ్‌కు ముందు, తర్వాత వివిధ విశ్లేషణల ద్వారా ప్రేక్షకులకు మరింత సమాచారాన్ని అందించారు. వారిలో కొంతమంది..
- భారత్‌కు చెందిన రిధిమా పాఠక్.. ఈమె బలమైన స్వరంతో ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందింది.
- పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ క్రీడాకారిణి జైనబ్ అబ్బాస్.. ఇప్పటికే అనేక అంతర్జాతీయ టోర్నీల్లో వాఖ్యాతగా ఉండటం సహా పాక్‌లో పలు క్రికెట్ షోలనూ నిర్వహించింది.
- అఫ్ఘానిస్థాన్‌కు చెందిన దివా పతంగ్.. నేషనల్ రేడియా టెలివిజన్ ఆఫ్ అఫ్ఘానిస్థాన్ (ఆర్టీఏ)లో స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా పనిచేస్తోంది.
ఈ ముగ్గురు క్రీడా వాఖ్యాతలు ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఐసీసీ 2019 ప్రపంచకప్ అనుభవాలను పంచుకున్నారు. ఈ టోర్నీతో వారందరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిందని వెల్లడించారు. దీంతో పాటు ప్రపంచకప్‌నకు సంబంధించిన కొన్ని విశేషాలను ఈ సందర్భంగా వెల్లడించారు.
లాక్డౌన్ సమయాన్ని ఎలా గడిపారు?
జైనబ్ అబ్బాస్: ఇంతకుముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎక్కడికి వెళ్లినా.. వాళ్లతో కలిసి వెళ్లేదాన్ని. కానీ, ప్రస్తుతం నేను ఇంటికే పరిమితమయ్యా. లాక్డౌన్ వల్ల కొన్ని లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి. ఏదేమైనా చివరికి క్రికెట్ తిరిగి ప్రారంభమైంది.
దివా పతంగ్: ప్రస్తుతం ప్రపంచమంతా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పుడు నేను లండన్‌లో ఉన్నా. ఇక్కడ నుంచి పనిచేయడం చాలా కష్టం.
దివా పతంగ్.. అఫ్ఘానిస్థాన్ క్రీడా వాఖ్యాతగా మీ ప్రయాణం ఎలా ఉంది?
దివా పతంగ్: క్రీడా వాఖ్యాతగా ఉండటం మహిళగా నాకు చాలా కష్టమైన పని. అఫ్ఘానిస్థాన్‌లో క్రికెట్.. పూర్తిగా పురుషుల ఆధిపత్య క్రీడ. ప్రారంభంలో నా తల్లిదండ్రులు దీనికి మద్దతు ఇవ్వలేదు. అయితే 2019 ప్రపంచకప్‌లో వాఖ్యాతగా పిలుపు వచ్చిన తర్వాత వారు అంగీకరించారు. ఎందుకంటే ఈవెంట్ ఇంగ్లాండ్‌లో జరగడమే కారణం. అక్కడ ఉండటానికి మా తల్లిదండ్రులకు ఎలాంటి సమస్య లేదు. ఒకప్పుడు అఫ్ఘాన్‌లో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఎందుకంటే మా దేశంలో నేను తప్ప మరొక మహిళా వాఖ్యాత లేరు.
ప్రపంచకప్-2019లో మీకు నచ్చిన ఉత్తమ మ్యాచ్, ఏదైనా మ్యాచ్‌లోని ఉత్తమ క్షణం చెప్పండి?
జైనబ్ అబ్బాస్: నా వరకు టోర్నీలో ఉత్తమమైన మ్యాచ్‌లు చాలానే ఉన్నాయి. వాటిలో ఒక మ్యాచ్‌ను ఎంచుకోవాలంటే కష్టం. కానీ, ఫైనల్ మ్యాచ్ మాత్రం చాలా ఆసక్తిగా సాగింది. పాకిస్థాన్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌ల్లో వాఖ్యాతగా ఉండటానికి ఇష్టపడతా. అదే విధంగా న్యూజిలాండ్-వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్‌ను ఆస్వాదించా. రెండు సెమీ ఫైనల్స్ అద్భుతంగా సాగాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కివీస్ చాలా బలంగా, నిలకడగా ప్రదర్శన చేసింది. పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ ఓటమి చెందినప్పటికీ కివీస్ ఆటగాళ్లు ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడారు.
ప్రపంచకప్-2019లో మీకు గుర్తున్న మరపురాని క్షణం ఏది?
రిధిమా పాఠక్: సెమీస్‌లో తలపడ్డ భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కాకుండా.. భారత్‌తో అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ నాకు బాగా గుర్తుంది. టీమ్ఇండియా, అఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్ కంటే ముందు నేను అభిమానులతో మాట్లాడా. ఆ మ్యాచ్‌లో ఇరుదేశాల ప్రేక్షకులు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. అదే విధంగా మహ్మద్ షమీ హ్యాట్రిక్ వికెట్లు సాధించినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది.