టీమిండియాకు అందని ద్రాక్షగా మిగిలిన ఐసీసీ ట్రోఫీలను అందించి గొప్ప కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఎంత ఒత్తిడి సమయంలోనైనా ప్రశాంతంగా ఉంటూ జట్టుకు మరపురాని విజయాలను అందించాడు. తాజాగా మహీపై ప్రశంసలు కురిపించాడు భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ.
"ధోనీ మైదానంలో చాలా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అది అతనిలో ఉన్న సహజ లక్షణంగా కనిపిస్తుంది. ధోనీలో ఉన్న లక్షణాలు అతను మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం చేయడంలో సహకరించాయి. మహీ ఎలా విజయవంతమైన కెప్టెన్ అయ్యాడో అందరికీ తెలుసు. మూడు ఐసీసీ ట్రోఫీలు, మూడు ఐపీఎల్ టైటిల్స్ సాధించాడు. భారత క్రికెట్ చూసిన అత్యుత్తమ కెప్టెన్ ధోనీ."
-రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్
ధోనీ ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడతాడని చెప్పాడు రోహిత్. జూనియర్, సీనియర్ ఎవరైనా ఒకేరకంగా చూస్తాడని తెలిపాడు.
"ధోనీ యువ బౌలర్లకు కావాల్సిన స్వేచ్ఛ ఇస్తాడు. ప్రత్యేకంగా మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బౌలర్ల నుంచి ఫలితాలు బాగా రాబడతాడు. బౌలర్లు ఒత్తిడిలో పడకుండా చూస్తాడు. ఏ రకంగా బంతులు వేయాలనే దానిపై ఇచ్చే సలహాలు ఇస్తాడు. సీనియర్, జూనియర్ క్రికెటర్లను ఒకే తరహాలో చూస్తాడు. వారిపై నమ్మకం ఉంచుతాడు. అలాగే ఫలితాల్ని కూడా అందుకుంటాడు. అందుకే ధోనీ ఉత్తమ కెప్టెన్."
-రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా. వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతోంది. తొలి వన్డే బుధవారం జరగనుంది. కానీ గాయం కారణంగా వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు రోహిత్.