ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా పేరున్న క్రిస్‌గేల్.. ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
"నా వికెట్ తీసేందుకు చాలా మంది యువ బౌలర్లు ప్రయత్నిస్తుంటారు. విభిన్నంగా బంతులు వేసినా సరే.. క్రీజులో ఉన్నది గేల్ అన్న విషయం వాళ్లకు తెలుసు. నాకు బౌలింగ్ చేసే సమయంలో గేల్ అంతటి ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ను చూడలేదని వాళ్లు మనసులో అనుకుంటారు. కానీ, కెమెరా ముందు మాత్రం గేల్ అంటే భయం లేదని చెప్తుంటారు. నిజానికి వాళ్ల మనసులో ఎంతో కొంత భయం ఉంటుంది. వాళ్లనే కెమెరా లేనప్పుడు అడిగితే.. అవును గేల్ ప్రమాదకర బ్యాట్స్‌మన్ అని ఒప్పుకొంటారు. ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోవడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తాను. నా ఆట గురించి ఇంకా నిరూపించుకోవడానికి ఏం మిగల్లేదు. కేవలం నా అభిమానుల కోసమే ప్రపంచకప్ ఆడుతున్నా".
-- క్రిస్‌గేల్, వెస్టిండీస్ క్రికెటర్
మే 30న ప్రారంభం కానున్న ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనేందుకు అన్ని జట్లు ఇంగ్లాండ్‌కు చేరుకుంటున్నాయి. ఐదోసారి ఈ మెగా టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఇంగ్లాండ్‌కు చేరుకున్నాడు. తనకు తానే యూనివర్స్ బాస్‌గా ప్రకటించుకున్న క్రిస్ గేల్.. ఈ ప్రపంచకప్‌లో బౌలర్లకు తనతో తిప్పలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాడు.
ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ విండీస్ వీరుడు 13 మ్యాచ్‌ల్లో 490 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో 326 సిక్స్‌లు కొట్టిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించాడు. మే 31న జరగనున్న తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది వెస్టిండీస్ జట్టు.