ఓ స్థాయికొచ్చిన తర్వాత కొంతమంది కన్నవారినే పట్టించుకోరు. అలాంటిది ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మాత్రం తనకు తండ్రే ముఖ్యమంటున్నాడు. ఆయన కోసం తన విజయాలను దూరం చేసినా.. ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నాడు. ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బెన్ స్టోక్స్ తండ్రి గెడ్.. నెమ్మదిగా కోలుకుంటున్నారు.
"ఈ ఏడాది ఎన్నో నమ్మలేని విజయాలు వచ్చాయి.. కొన్ని అపజయాలూ ఎదురయ్యాయి. కానీ మా నాన్న ఆసుపత్రిలో ఉండటం చూస్తుంటే.. అవన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. ఎవరైన నా దగ్గరకొచ్చి 'నీకు దక్కిన విజయాలన్నీ దూరం చేస్తా.. మీ తండ్రిని మాత్రం ఆరోగ్యంగా.. ఆనందంగా ఉంచి.. నీ ఆట చూసే అవకాశం కల్పిస్తా' అంటే నా సక్సెస్‌ను దూరం చేసుకోవడానికి తప్పకుండా అంగీకరిస్తా"
-బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్
ఇప్పుడిప్పుడే తన తండ్రి కోలుకుంటున్నాడని స్టోక్స్ చెప్పాడు.
"ప్రస్తుతం మా నాన్న ఆరోగ్యం స్థిమితపడింది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయనను జాగ్రత్తగా చూసుకుంటున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు" - బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 107 పరుగుల తేడాతో ఓడి 4 టెస్టుల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకంజలో ఉంది. కేప్‌టౌన్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు జరగనుంది. నాలుగేళ్ల క్రితం ఈ మైదానంలోనే స్టోక్స్(258) తన కెరీర్ అత్యుత్తమ స్కోరు సాధించాడు.
సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా ఆరుగురు సహాయసిబ్బంది సహా ఇంగ్లాండ్ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. జట్టు సభ్యులు ఇలా అనారోగ్యం బారిన పడటాన్ని స్టోక్స్.. కర్స్డ్ టూర్‌గా(చెడ్డ పర్యటన) పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: హార్దిక్ ప్రేమలో పడ్డాడు.. ఇన్ స్టా వేదికగా ప్రకటన