భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ నవంబరులో టెస్టు సిరీస్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో సిరీస్ నిర్వహణపై సందేహాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో స్పందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. మ్యాచ్‌లు ప్రారంభానికి రెండు వారాల ముందు టీమిండియా క్రికెటర్లను రెండు వారాలు క్వారంటైన్లో ఉంచేందుకు సిద్ధమని తెలిపింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇదే విషయమై తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్.. రెండు వారాల క్వారంటైన్‌కు సిద్ధంగా ఉన్నామని, క్రికెట్ ప్రారంభమవ్వాలంటే ఇలాంటివి తప్పవని అభిప్రాయపడ్డారు.
ఈ సిరీస్ కంటే ముందు ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టోర్నీ జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అప్పటికి పరిస్థితి సర్దుకున్నా, ఇతర దేశాల బోర్డులు.. తమ ఆటగాళ్లను అక్కడికి పంపిస్తాయా? అనేది సందేహంగా మారింది.
కరోనా వల్ల భారత్‌లో ప్రస్తుతం క్రికెట్‌కు సంబంధించిన ఏ కార్యక్రమాలు జరగడం లేదు. ఐపీఎల్ 13వ సీజన్‌నూ ఇప్పటికే నిరవధిక వాయిదా వేశారు.