త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 13వ సీజన్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రస్తుతం యూఏఈలో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు షార్జా అంతర్జాతీయ క్రికెట్ స్డేడియాన్ని సందర్శించాడు. అక్కడ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అధికారులు, ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్‌తో కలిసి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా ఆ స్టేడియంలో తీసుకున్న ఫొటోలను గంగూలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
అయితే, ఇక్కడే ఓ విషయం గమనించాల్సింది ఉంది. అతడు పోస్టు చేసిన మూడు ఫొటోల్లో ఒకదాంట్లో స్టేడియంపై భాగంలో ఒక హోర్డింగ్ కనపడుతోంది. దానిమీద పాకిస్థాన్ ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా తీసిన ఫొటోలా కనిపించడం వల్ల దాదా దాన్ని ఇన్‌స్టాలో పోస్టు చేసేముందు బ్లర్ చేసినట్లు స్పష్టమవుతోంది.
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య దాదాపు 8 ఏళ్లుగా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ పాక్‌తో సిరీస్‌కు ససేమిరా అంటోంది.