కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ టోర్నీలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పలు బోర్డులకు ఈ విషయం తలనొప్పిగా మారింది. అనుకున్న తేదీల్లో మ్యాచ్‌లు జరగకపోవడం వల్ల పలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై రద్దయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఆ దేశంలో జరగబోయే భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్ట్స్.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇరుజట్ల మధ్య జరగాల్సిన ఐదు టెస్టుల్ని ఒకే వేదికలో నిర్వహించాలని భావిస్తున్నట్లు బీసీసీఐకి ప్రతిపాదన పంపింది ఆస్ట్రేలియా బోర్డు. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించాల్సి ఉంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బీసీసీఐ అధికారి.. ఆస్ట్రేలియా ప్రతిపాదించిన ఐదు టెస్టుల సిరీస్ గురించి తాము ఆలోచిస్తున్నామని అన్నారు. భవిష్యత్తు పరిస్థితుల్ని చూసి ఆసీస్‌తో టెస్టు సిరీస్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇప్పటికే పలు సిరీస్‌లు రద్దవడం వల్ల 20 మిలియన్ల డాలర్లు నష్టపోయింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ రద్దయితే అది ఇంకా తీవ్రంగా ఉంటుంది. దానిని కొంతమేర పూడ్చుకునేందుకు భారత్‌తో నాలుగు బదులు, మరో టెస్టు అదనంగా ఆడాలని ప్రతిపాదన పంపింది.