ఐపీఎల్-2020 టెలివిజన్ రేటింగ్ రికార్డులను బ్రేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. టీవీ వీక్షణ పరంగా అత్యంత విజయవంతం అవుతుందన్నారు. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని, సాధారణ స్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సింబయాసిస్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
"అభిమానులు టీవీల్లో చూస్తారు. ఈ ఐపీఎల్ సీజన్‌ను అత్యధిక మంది వీక్షిస్తారని బ్రాడ్‌కాస్టర్లు అంచనా వేస్తున్నారు. మైదానాలను రాలేని క్రికెట్ ప్రేమికులు కచ్చితంగా టీవీలకు అతుక్కుపోతారని వారు విశ్వసిస్తున్నారు. ప్రతిదానిలోనూ ఏదో ఒక సానుకూలత ఉంటుంది"
--సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
కొవిడ్-19 మహమ్మారి సమయంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడంలో ఐపీఎల్ సైతం భాగమవుతుందని గంగూలీ పేర్కొన్నారు. ఖాళీ స్టేడియాల్లో ఆడటంపై క్రికెటర్లు ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించగా.. "కరోనా సోకుతుందనే ప్రజలు దగ్గర దగ్గరగా ఉండటం లేదు. భౌతికదూరం పాటిస్తూ 30% మంది స్టేడియాల్లో కూర్చొనే రోజులు వస్తాయి. వారిని కట్టుదిట్టంగా పరీక్షించి లోపలికి పంపించాల్సి ఉంటుంది. అందుకు కాస్త సమయం పడుతుంది" అని దాదా వెల్లడించారు.
"జీవితాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో ఐదారు నెలల్లో టీకాలు రావొచ్చు. అంతా యథాస్థితికి వచ్చేస్తుందన్న నమ్మకం ఉంది. ఇది కేవలం వైరస్. క్రమంగా బలహీన పడుతోంది. మనం దానిపై విజయం సాధించగలం. మనం ఐపీఎల్‌ను నిర్వహించకుండా ఉండొచ్చు. కానీ.. ఆ తర్వాత? యుద్ధాలెన్నో వచ్చాయి. మనుషులు వాటిని దాటేశారు. ఇలాంటి ఉపద్రవాలూ అంతే. బుద్ధిని బట్టే ఏదైనా"
--సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఈ నెల 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్-13 టోర్నీ ఆరంభం కానుంది. అయితే ఇప్పటివరకు లీగ్ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేయలేదు.