లాక్డౌన్ తర్వాత టీమ్ఇండియా ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఓడిపోయింది. సిడ్నీలో జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో 67 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫించ్(114), స్మిత్(105) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో వన్డే సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఫించ్(114), వార్నర్(69).. తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించారు. అనంతరం ధనాధన్ ఇన్నింగ్స్‌లతో స్మిత్(62 బంతుల్లో 105 పరుగులు), మ్యాక్స్‌వెల్(19 బంతుల్లో 45) ఆకట్టుకున్నారు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో స్టోయినిస్(0), లబుషేన్(2), క్యారీ(17), కమిన్స్(1) నామమాత్రపు పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమి 3 వికెట్లు తీయగా, బుమ్రా, చాహల్, సైనీ తలో వికెట్ పడగొట్టారు.

375 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన టీమ్ఇండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 315 పరుగులు మాత్రమే చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లుగా బరిలో దిగిన మయాంక్ అగర్వాల్(22) ఔటవ్వగా.. ధావన్(74) బాగానే రాణించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ(21), శ్రేయస్ అయ్యర్(2) అభిమానులను నిరాశపరిచారు. హార్దిక పాండ్య(90).. తన వన్డే కెరీర్లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఆ తర్వాత జడేజా, నవదీవ్ సైనీ ఆడినప్పటికీ గెలిపించలేకపోయారు.
